షెడ్డు కి చేరబోతున్న టాలీవుడ్ డైరెక్టర్లు... లిస్టులో తాజాగా చేరిన శ్రీను వైట్ల...!

By Xappie Desk, November 16, 2018 18:43 IST

షెడ్డు కి చేరబోతున్న టాలీవుడ్ డైరెక్టర్లు... లిస్టులో తాజాగా చేరిన శ్రీను వైట్ల...!

టాలీవుడ్ లో ప్రతీ ఏడాది సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి. ఎంతో మంది కొత్త దర్శకులు తమ సత్తా ఎంతో ప్రేక్షకులకి చూపించాలని ఇండస్ట్రీలో పడిగాపులు కాస్తున్నారు. అయితే ఇక్కడ విశేషమేమిటంటే వారితో పాటు కొంతమంది పేరున్న దర్శకులు కూడా పోటీపడుతున్నారు. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన వారి ఆశలు ఇప్పుడు మినుకు మినుకుమంటున్నాయి. వారిని పరాజయాలు అదే పనిగా పలకరిస్తుంటే… విజయం కనీసం వాకిట్లోకి కూడా రానంటుంది. ఒకప్పుడు స్టార్ దర్శకులుగా పేరొందిన అందరూ ఇప్పుడు షెడ్డుకు బారులు తీరారు. వారిపై ఒక లుక్కేద్దాం..!
 
షెడ్డుకు వెళ్ళిపోయిన డైరెక్టర్ల గురించి మాట్లాడుకోవాలంటే ముందు పూరీ జగన్నాథ్ పేరు వస్తుంది. కెరీర్ మొదట్లో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన పూరీ గ్రాఫ్ రాను రానూ పడిపోయింది. గత కొన్నేళ్లుగా వరుస సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు పూరీ. “టెంపర్” తర్వాత అతని కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటీ లేదు. తరువాత అతను తీసిన లోఫర్, రోగ్, జ్యోతిలక్ష్మి, ఇజం, పైసా వసూల్ చిత్రాలు ఆనవాళ్లు లేకుండా పోయాయి. చివరికి కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ తీసిన “మెహబూబా” కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. తనకంటూ ప్రత్యేకంగా ఏర్పడిన అభిమానులు కూడా పూరి సినిమాను లైట్ తీసుకుంటున్నారంటే అతను ఎంతగా నిరాశపరిచాడు చెప్పనక్కర్లేదు.
 
అతని తరువాత లిస్టులో ఉన్నది మన శ్రీను వైట్ల. యాక్షన్ సినిమాలకు తనదైన శైలిలో కామెడీని జోడించి ఎన్నో హిట్లు కొట్టిన శీను ఇప్పుడు పూర్తిగా ఢీలా పడిపోయాడు. ఆగడు లాంటి డిజాస్టర్ తర్వాత అతను తెరుకొలేకపోయాడు. బ్రూస్లీ కూడా అంతగా జనాలను మెప్పించలేకపోయింది. ఇక “మిస్టర్” అయితే చడీచప్పుడు లేకుండా వెళ్లిపోయింది. ఈ రోజు రిలీజ్ అయిన “ అమర్ అక్బర్ ఆంటోనీ” థియేటర్ల దగ్గర తేలిపోయింది. కోన వెంకట్ వీడినప్పటినుండి ఇతని పరిస్థితి గ్రహణం పట్టినట్లు తయారయింది. ఇతను తన సినిమాలన్నీ ఒకే పంథాలో నడిపించడం ఎవరికీ నప్పడంలేదు.
 
ఇకపోతే వి.వి.వినాయక్ పరిస్థితి వర్ణనాతీతం. “బద్రీనాథ్” లాంటి భారీ ఫ్లాప్ తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకొని చేసిన “అఖిల్” అంతకు మించిన ఫ్లాప్ అయింది. మళ్లీ శ్రీనివాస్ నీ పరిచయం చేసిన “అల్లుడు శీను” కూడా అడ్రస్ లేకుండా పోయింది. ప్రతిష్టాత్మక “ఖైదీ 150” హిట్ అయినా అది రీమేక్ సినిమా అవడంతో పెద్దగా పేరు రాలేదు. ఇక ఈ ఏడాది వచ్చిన “ఇంటెలిజెంట్” తో తాను బ్యాక్ టు ఫామ్ అని చాటుకున్నారు.
 
తరువాత వరసలో కృష్ణవంశీ, కరుణాకరన్ ఉన్నారు. పైసా, నక్షత్రం లాంటి కళాఖండాలతో నిరాశపరిచిన వంశీ “గోవిందుడు అందరివాడేలే” తో పరవాలేదనిపించినా తర్వాత అవకాశాలు రాలేదు. ప్రేమ చిత్రాలు తీయడంలో సిద్ధహస్తుడు అని పేరున్న కరుణాకరన్ కూడా ఎందుకంటే ప్రేమంట, చిన్నదాన నీకోసం, తేజ్ ఐ లవ్ యు లతో ఈ లిస్టులో చేరిపోయాడు. ఇక బ్రహ్మోత్సవం లాంటి అట్టర్ ఫ్లాప్ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల పేరే వినిపించలేదు. ఇక మెహర్ రమేష్ పేరు మర్చిపోయి చాలా కాలమైంది.
 
యువ దర్శకుడు మారుతీ కూడా వీరి బాటలోనే ఉన్నాడు. ఒకటే ఫార్ములాని నమ్ముకుని ఈయన తీసిన చిత్రాలు ఒక వర్గం ప్రేక్షకులను అలరిస్తున్నా, చాలామందికి ఎగటు కొట్టేసాయి అని శైలజా రెడ్డి అల్లుడు నిరూపించింది. మున్ముందు ఇతని పరిస్థితీ ఇంతే అనుకుంటున్నారు జనాలు. ఇలా వైవిధ్యం లేకుండా రొటీన్ ఫార్ములాని నమ్ముకొని సినిమాలు చేస్తే తరుణ్ భాస్కర్, సుజిత్, సందీప్ రెడ్డి, సంకల్ప్ ప్రశాంత్ వర్మ వంటివారు వీరి స్థానాలను భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరి నుండి 'కమ్ బ్యాక్' ఆశించడం కూడా అత్యాశ అనే చెప్పాలి ఇంక.
 


Forum Topics


Top