బస్సు డ్రైవర్ కొడుకు - దేశం మొత్తానికీ స్టార్ హీరో !

By Xappie Desk, January 01, 2019 22:21 IST

బస్సు డ్రైవర్ కొడుకు - దేశం మొత్తానికీ స్టార్ హీరో !

టాలెంట్ ఉండాలి కానీ ఏదో ఒకరోజు ప్రపంచం మన ప్రతిభ గుర్తించే తీరుతుందని కన్నడ హీరో యష్ నిరూపిస్తున్నాడు. కెజిఎఫ్ నమోదు చేస్తున్న వసూళ్లు చూసి జాతీయ స్థాయిలో ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. శాండల్ వుడ్ లో యష్ సుపరిచితుడే కానీ పక్కన ఉన్న మనకు కెజిఎఫ్ ముందు వరకు అతను ఎవరో తెలియదు. ఇప్పుడు ఇతని నేపథ్యం గురించి ప్రేక్షకుల్లో సైతం ఆసక్తి పెరిగిపోయింది. అదేంటో చూద్దాం.

యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. కర్ణాటక హాసన్ జిల్లాలో భువనహళ్లి అనే గ్రామం ఇతని స్వస్థలం. వొక్కలిగల సామాజిక వర్గానికి చెందిన యష్ నాన్న పేరు అరుణ్ కుమార్. ఈయన కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగి. కండక్టర్ గా ప్రస్థానం కొనసాగిస్తున్నారు. ఇప్పుడు బిఎంటిసిలో కొనసాగుతున్నారు. అమ్మ పేరు పుష్ప. గృహిణి. యష్ బాల్యం నాన్న ఉద్యోగరిత్యా మైసూర్ లో సాగింది. అక్కడే మహాజన హై స్కూల్ లో తన విద్యాభ్యాసం పూర్తి చేసాడు. నటన మీద ఆసక్తితో సుప్రసిద్ధ డ్రామా ఆర్టిస్ట్ బివి కరనాథ్ శిష్యరికం చేసిన యష్ ఆ కారణంగానే బెనక డ్రామా ట్రూప్ లో చేరాడు

యష్ ది చక్కని కుటుంబం. ఇతనికో చెల్లెలు కూడా ఉంది. పేరు నందిని. ఇటీవలే ఓ కూతురికి తండ్రైన యష్ ఆ ఆనందాన్ని అనుభవిస్తుండగానే కెజిఎఫ్ రూపంలో బ్లాక్ బస్టర్ సక్సెస్ పలకరించింది. దీన్ని శుభ సూచకంగా భావిస్తున్నాడు యష్. ఒక సాధారణ కండక్టర్ కొడుకు ఇలా ఇంత పెద్ద స్థాయికి చేరుకుంటాడు అనేది ఎవరూ ఊహించనిది. నటన మీద పిచ్చే యష్ ని ఇక్కడి దాకా తీసుకొచ్చిందని అతని ఆసక్తిని ఏనాడూ చిన్న బుచ్చే ప్రయత్నం చేయకపోవడం వల్లే యష్ ఈ స్థాయికి చేరుకున్నాడని అరుణ్ కుమార్ గర్వంగా చెబుతారు. అవును మరి. పిల్లల ఆసక్తిని గమనించి వాళ్లకు ఆసక్తి ఉన్న రంగంలోకి ప్రోత్సహిస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చెప్పడానికి యష్ కన్నా మంచి ఉదాహరణ ఇంకేం కావాలి .


Forum Topics


Top