త్వరలో పవన్ భారీ బహిరంగ సభ విజయవాడ ప్రాంతంలో..!

త్వరలో పవన్ భారీ బహిరంగ సభ విజయవాడ ప్రాంతంలో..!

పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ ప్రాంతంలో వామపక్ష పార్టీలు నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు హాజరవబోతున్నట్లు సమాచారం. గతంలో గుంటూరు జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ నాయకులను ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ని ఆయన కుమారుడు నారా లోకేష్ ని ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు. అధికారంలో ఉండి ప్రజలను ఏ స్వార్ధం గా పరిపాలించిన నాయకులు ఇసుక మాఫియా, కుంభ‌కోణాలు, దోపిడీలు చేసే వీళ్ల‌కే పిచ్చిపిచ్చిగా మాట్లాడే తెగింపు ఉంటే.. ప్ర‌జా సంక్షేమం కోసం నిల‌బ‌డే నాకు ఇంకా ఎంత ఉంటుందని ఘాటుగా మండిపడ్డారు.
 
ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత జీవితం కోస్తే మామూలుగా ఉంటాడేమో వ్యవస్థ జోలికి వస్తే తాట తీస్తాడు అంటూ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో అప్పట్లో ప్రసంగించిన విధానం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా విజయవాడలో సభ ప్లాన్ చేసిన వామపక్షాల తరఫున సీపీఐ నాయకుడు రామకృష్ణ.. హైదరాబాదులోని పార్టీ కార్యాలయానికి వచ్చి.. తమ మహాగర్జనసభకు పవన్ ను ఆహ్వానించారు. పవన్ ను వ్యక్తిగతంగా కలవకపోయినప్పటికీ.. పార్టీ రాజకీయ వ్యవహారల కమిటీ సభ్యులను కలిసి పవన్ ను సభకు ఆహ్వానించారు.
 
జనసేన నుంచి ఈ ప్రతిపాదనకు ఇప్పటిదాకా అధికారిక గ్రీన్ సిగ్నల్ రాలేదు. కానీ ఎర్ర నాయకులు తమదంతా ఒకే కూటమి అనే ప్రచారం చేసుకుంటున్నారు. అదంతా పక్కన పెడితే.. వామపక్షాల సభలో పవన్ కూడా పాల్గొంటారని.. సభను వేడెక్కిస్తారని… చంద్రబాబునాయుడు ప్రభుత్వం తీరు మీద మరోసారి నిప్పులు చెరగుతారని వామపక్ష పార్టీల తరఫున వస్తున్న సమాచారం.Top