మహాకూటమి టైమ్ వేస్ట్ పని – కాంగ్రెస్ ఫీలింగ్ ఇదే ?

By Xappie Desk, November 08, 2018 14:31 IST

మహాకూటమి టైమ్ వేస్ట్ పని – కాంగ్రెస్ ఫీలింగ్ ఇదే ?

ఇంకొక నెల రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమవుతున్నాయి. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడానికి మరింకెంతో సమయం కూడా లేదు. ఈ సమయంలో కాంగ్రెస్ చాలా విషయాల్లో టిఆర్ఎస్ కన్నా వెనుకబడే ఉందని చెప్పాలి. పొత్తుతో వచ్చిన విపత్తు గురించి కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. అసలు ఈ మహా కూటమి వల్ల వాటిల్లుతున్న నష్టం ఏమిటి అనేగా మీ ప్రశ్న…
 
టిఆర్ఎస్ ఇప్పటికే అన్నీ నియోజకవర్గాల నుంచి తమ తమ అభ్యర్థులను ప్రకటించి మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసి ఉత్సాహంతో దూసుకుపోతుంది. మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఇంకా సీట్ల కేటాయింపు విషయంలో తచ్చాడుతుంది. టిడిపి తనకు కేటాయించిన 14 సీట్లతో సరిపెట్టుకోగా, మహాకూటమిలో భాగస్వాములైన టీజేఎస్‌, సీపీఐలు తాము కోరిన సీట్లు ఇవ్వాలని పట్టుబట్టడంతో కాంగ్రెస్‌ అందుకు ఒప్పుకోవడం లేదు. ఈ నెల 9వ తేదీన కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పినా కూడా వారు ఇంకా ఫైనల్ లిస్ట్ చేసే విషయంలో సందిగ్ధంలో ఉన్నారని తెలుస్తోంది.
 
ఇటు చూస్తే సీపీఐ అధ్యక్షుడు చాడ వెంకటరెడ్డి ఇటీవల 9 స్థానాల్లో మా అభ్యర్థులు వీరేనని ప్రకటన చేశారు. దీంతో మహాకూటమి అభ్యర్థుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. మరోవైపు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సైతం తమకు 13 సీట్లు కేటాయించాలని కోరినట్లు సమాచారం. కనీసం పది సీట్లు అయినా లేనిదే వారు ఊరుకొని ఉండరు అన్న విషయం స్పష్టం.
 
ఇటీవల కోదండరాం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తో భేటీ అయ్యారు. ఆయన సీట్ల కేటాయింపు విషయంలో మరీ పట్టుపట్టారట. అయితే రాహుల్ కాంగ్రెస్ గుర్తు పైన పోటీ చేయమని సూచించగా అందుకు ఈ టీజేఎస్ అధ్యక్షుడు ససేమీరా అన్నాడట. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం 7 సీట్లకు మించి వీరికి ఇచ్చేటట్లు కనిపించట్లేదు. సీపీఐ కూడా కేవలం 4 సీట్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొందట. ఇదే కనుక జరిగితే పరిణామాలు తేడాగా ఉంటాయని వారు సున్నితమైన హెచ్చరికలు జారీ చేశారు. తమకు అవసరమైన స్థానాల్లో సీట్లు కేటాయించకపోతే ఫ్రెండ్లీ పోటీ చేస్తామని అంటున్నారు. ఇది మహా కూటమా లేక మహా కుంపటా అంటూ కాంగ్రెస్ తల పట్టుకుంటుంది.Top