అత్తని ఓడించడమే అల్లుడి టార్గెట్ !

By Xappie Desk, November 15, 2018 17:24 IST

అత్తని ఓడించడమే అల్లుడి టార్గెట్ !

కాంగ్రెస్ మహిళా నేతల్లో ఫైర్ బ్రాండ్ లీడర్స్ చాలామందే వున్నారు. రేణుక చౌదరి... గీతారెడ్డి... డీకే అరుణ ఇలా. వీరే కాకుండా ఇంకా సమర్ధవంతంగా పాలించగల మహిళా నేతలకు కాంగ్రెస్లో కొదవ లేదు. కాంగ్రెస్ కూడా మహిళా నేతలకు అలాగే ప్రోత్సాహం అందిస్తుంది. అలాగే ఈసారి కూడా పెద్ద సంఖ్యలో మహిళా నేతలకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది. ఇలా బరిలోకి దిగిన ఫైర్ బ్రాండ్ నేతల్లో డీకే అరుణ ఒకరు. కొన్నేళ్లుగా గద్వాల నియోజకవర్గంలో డీకే అరుణ కుటుంబం అప్రతిహతంగా హవా సాగిస్తోంది. డీకే అరుణకు చెక్ పెట్టాలని ఆమెకు అల్లుడు వరసయ్యే నేత గత రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇపుడు మూడోసారి కూడా ఆయన అరుణపై టిఆర్ఎస్ తరపున పోటీలో వున్నారు. దాంతో అత్తా అల్లుళ్ళ పోరాటం జరుగుతున్న గద్వాల రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది.
 
ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల అసెంబ్లీ స్థానం నుండి 2004 నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్ధి డీకే అరుణ విజయం సాధిస్తున్నారు. ఈ దఫా మరోసారి ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా మరోసారి బరిలోకి దిగుతున్నారు.గద్వాల అసెంబ్లీ ఎన్నికల్లో 1999లో టీడీపీ అభ్యర్ధిగా డీకే అరుణ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అంతకుముందు ఇదే స్థానం నుండి అరుణ భర్త డీకే భరత సింహా రెడ్డి టీడీపీ మద్దతుతో విజయం సాధించారు. 2004 ఎన్నికల సమయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఐఎం పార్టీల మధ్య పొత్తు ఉంది.పొత్తులో భాగంగా ఈ సీటును అప్పట్లో టీఆర్ఎస్ కోరుకొంది. కాంగ్రెస్ టికెట్టు ఆశించిన డీకే అరుణకు టికెట్టు రాలేదు. అరుణతో పాటు ఆ సమయంలో ఉన్న మక్తల్ స్థానం నుండి అరుణ తండ్రి చిట్టెం నర్సిరెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్టు దక్కింది. చిట్టం నర్సిరెడ్డి మక్తల్ నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. దీంతో డీకే అరుణ సమాజ్ వాదీ పార్టీ అభ్యర్ధిగా (ఇండిపెండెంట్ గా ) పోటీ చేసి విజయం సాధించారు. 2009లో మరోసారి గద్వాల నుండి ఆమె పోటీ చేసి విజయం సాధించారు. 2009లో ఆమెకు కాంగ్రెస్ టికెట్టు దక్కింది.
 
2014 ఎన్నికల్లో కూడ ఆమె కాంగ్రెస్ టికెట్టుపై పోటీ చేసి విజయం సాధించారు. 2009లో ఆమె వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య మంత్రివర్గాల్లో పనిచేశారు. డీకే అరుణపై టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కృష్ణమోహన్ రెడ్డి గతంలో డీకే అరుణ భర్త భరతసింహారెడ్డికి అనుచరుడిగా ఉండేవాడు. ఆయన వారి కుటుంబానికి దగ్గరి బంధువు కూడా. అయితే ఆ తర్వాత డీకే కుటుంబంతో విభేదించి తొలుత బీకే కృష్ణమోహన్ రెడ్డి టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారు.2009లో టీడీపీ అభ్యర్థిగా, 2014లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా బీకే కృష్ణమోహన్ రెడ్డి .. డీకే అరుణపై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. గత నాలుగున్నర ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వహయంలో చేసిన అభివృద్దిని టీఆర్ఎస్ అభ్యర్ధి కృష్ణమోహన్ రెడ్డి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. గద్వాల నియోజకవర్గంలో అభివృద్ధికి తమ కృషే కారణమని మాజీ మంత్రి డీకే అరుణ, టీఆర్ఎస్ నేత కృష్ణమోహన్ రెడ్డిలు చెబుతున్నారు.2009 నుండి 2014 వరకు మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో తాను ప్రారంభించిన అభివృద్ధి పనులను పూర్తి చేసినట్టుగా అరుణ చెబుతున్నారు.
 
కానీ టీఆర్ఎస్ హాయాంలోనే గద్వాలలో అభివృద్ధి జరిగిందని కృష్ణమోహన్ రెడ్డి చెబుతున్నారు. గద్వాల నియోజకవర్గం నుండి పోటీలో ఉన్న కాంగ్రెస్ నేత డీకే అరుణను ఓడించేందుకు టీఆర్ఎస్ తన శక్తియుక్తులను ధారపోస్తోంది. ఈ నియోజకవర్గంలో కొంత కాలంగా హరీష్ రావు ప్రత్యేకంగా వ్యూహరచన చేశారు. హరీష్ వ్యూహన్ని కృష్ణమోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. మూడోసారి అయినా అత్తపై కృష్ణమోహన్ రెడ్డి విజయం సాధిస్తారో లేదో గద్వాల్ ఓటర్లే చెప్పాలి.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop