జేడీ పార్టీ పెడుతున్నాడు… మీరు సపోర్ట్ చేస్తారా?

By Xappie Desk, November 24, 2018 18:17 IST

జేడీ పార్టీ పెడుతున్నాడు… మీరు సపోర్ట్ చేస్తారా?

సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ముందస్తు పదవీ విరమణ చేసిన నేపథ్యంలో చాలా అనుమానాలు వ్యక్తమవుతూ ఉండేవి. ఆయన రాజకీయాల్లోకి వస్తారా? వస్తే ఏ పార్టీలో చేరుతారు? ఎవరి వెంట నడుస్తారు? అంటూ చాలా రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తాజాగా ఈ ప్రశ్నలన్నింటికీ లక్ష్మీనారాయణ సమాధానం చెప్పశారు. తన రాజకీయ అరంగేట్రాన్ని స్వయంగా ప్రకటించారు. అయితే - అంతా ఊహించినట్లుగా తాను ఏ పార్టీలోనూ చేరబోవడం లేదన్నారు. ఈ నెల 26న తాను కొత్త పార్టీ స్థాపించబోతున్నట్లు వెల్లడించారు.
 
అదే రోజున ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి, తమ పార్టీ సిద్ధాంతాలను వెల్లడిస్తానని చెప్పాడు. అయితే ఆయన ఈ ప్రకటన ప్రకటించినప్పటినుండి పార్టీ స్థాపన వెనుక ఆయన లక్ష్యాలు ఏంటనే విషయంపై భిన్న ఊహాగానలు వెలువడుతున్నాయి. పార్టీ ఏర్పాటు ప్రకటన చేసిన లక్ష్మీనారాయణ హైదరాబాద్ లో రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావును కలవడం కూడా పలు ఊహాగానాలకు తావిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను ప్రభావితం చేయగల వ్యక్తి రామోజీ రావు అని పలువురు అంటుంటారు. తెలంగాణాలో ఏర్పడిన మహాకూటమి వెనుక కూడా ఆయన హస్తం ఉందని కొందరి వాదన. ఇలాంటి రాజకీయ రాజగురువుగా చెప్పబడే రామోజీరావు ని కలవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
 
అది కాకుండా జేడీ లక్ష్మీనారాయణ ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన కొత్త పార్టీ పెట్టడం ద్వారా ఆ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అతని వైపు మొగ్గు చూపుతారని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ లోని ఒక పార్టీకు సదరు సామాజికవర్గం అండ ఉంది. ఇప్పుడు ఈయన రాకతో వారి ఓటు బ్యాంకు తారుమారు కావచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఆ వర్గం ఓట్లు చీల్చి ఓ పార్టీకి నష్టం చేకూర్చాలన్న లక్ష్యంతోనే కొందరు ప్రముఖులు కలిసి లక్ష్మీనారాయణతో పార్టీ పెట్టిస్తున్నారనే ప్రచారమూ జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈయన కొత్తగా పెట్టబోయే రాజకీయ పార్టీకి ఎంతమంది మద్దతు పలుకుతారు అనేది ఇక్కడ ఉద్భవిస్తున్న ప్రశ్న.Top