రేవంత్ ముఖ్యమంత్రి...సుహాసిని మంత్రి !

By Xappie Desk, November 26, 2018 14:18 IST

రేవంత్ ముఖ్యమంత్రి...సుహాసిని మంత్రి !

తెలంగాణలో పోలింగ్ ఇంకా జరగలేదు. ఓట్ల లెక్కింపు ముగియలేదు. అధికారం ఎవరు చేపడతారో ఇంకా తెలియలేదు. అయితే మహాకూటమిలో మాత్రం తమ ముఖ్యమంత్రి ఇతనే అంటూ చర్చలు మొదలైపోయాయి. వినడానికి కొంచెం విడ్డూరంగా ఉన్నా ప్రస్తుతం కూటమిలో జరుగుతున్న తంతు అదే. వారి ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? ఒక్కసారి కూడా మంత్రి పదవి చేపట్టని రేవంత్ రెడ్డి. అలాగే తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న సుహాసినికి మంత్రి పదవి ఇచ్చేస్తారట. ఇప్పుడు కూటమిలో ఎంతో అత్యుత్సాహం తో జరుగుతున్న చర్చలు ఇవే.
 
తాజాగా మీడియా ముందు వచ్చి చర్చించిన రేవంత్ రెడ్డి తానే ముఖ్యమంత్రిని అని చెప్పలేదు కానీ ఈ ఎన్నికల్లో మహా కూటమి విజయం తధ్యమని, అధికారంలో తాను పోటీ చేస్తున్న కొడంగల్ నియోజకవర్గం కీలక పాత్ర పోషించబోతుందని ఇండైరెక్టుగా హింట్ ఇచ్చేశారు. మంత్రిగా ఒక్కసారీ బాధ్యతలు నిర్వహించని రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అవడమేంటి.? అని అంతా ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ సుహాసిని మంత్రి కాబోతుందని జోస్యం చెప్పారు. అదే కాకుండా కూకట్‌పల్లి నుంచి టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ టీడీపీ సీనియర్‌ నేత పెద్దిరెడ్డికి 2019 ఎన్నికల్లో ఎంపీగా ఛాన్స్‌ ఇస్తారట. ఆయన్ని గెలిపించే బాధ్యత తనదేనన్నది సర్వే సత్యనారాయణ.
 
కానీ కాంగ్రెస్ పార్టీ లోని మహిళా నేతలు మాత్రం ఈసారి ముఖ్యమంత్రి పదవి తమదేనంటూ తెగ ఉత్సాహంతో ఉన్నారు. పార్టీలో కీలకమైన మహిళా నేతలైన గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, విజయశాంతి, డీకే అరుణ ముఖ్యమంత్రి పదవి తమదేనంటూ తమ తమ వర్గాల్లో ప్రచారం చేసుకుంటూ ఉండగా వారి అధిష్టానం కూడా మహిళా ముఖ్యమంత్రి వైపే మొగ్గుచూపుతుండటం గమనార్హం. ఒకపక్క తాజా సర్వే మళ్లీ టిఆర్ఎస్ అధికారం చేపడుతుందని చెప్తుంటే మరోపక్క వీరు మాత్రం అధికారం మోజులో పడి అవకాశం చూసుకొని ఒకరిపై ఒకరు అక్కసు వెల్లగక్కుతున్నారు. అయినా అధికారం చేతికి రావాలంటే ముందు గెలవాలి కదా...!
 Top