కెసిఆర్ పై అమిత్ షా ఊహించని వ్యాఖ్యలు !

By Xappie Desk, November 26, 2018 20:18 IST

కెసిఆర్ పై అమిత్ షా ఊహించని వ్యాఖ్యలు !

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపు మీద ఉంది. మరికొద్ది రోజుల్లోనే పోలింగ్ ఉన్న నేపథ్యంలో పోటీ పోటీగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నాయి. బ‌హిరంగ స‌భ‌ల‌తో ప్ర‌చార ప‌ర్వంతో దూసుకెళుతున్నాయి. అలాగే ప్ర‌చార క్ర‌మంలో రాజ‌కీయ పార్టీల నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఒకరిమీద ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ కత్తులు దూసుకుంటున్నారు. రాష్ట్రమంతటా విమర్శలు గుప్పుమంటున్నాయి.
 
ఈ సమయంలోనే గులాబీ అధినేత కేసీఆర్ పైన బిజెపి అధ్యక్షుడు అయిన అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఉన్న అన్ని స్థానాల్లో బిజెపి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కనీసం కొద్ది స్థానాల్లో అయినా వారు తమ పట్టును నిలుపుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అందుకోసం అమిత్ షా ఇప్పటికే తెలంగాణలో ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో నరేంద్ర మోడీ కూడా ప్రచారంలో భాగంగా తెలంగాణకు రానున్నారు. ఇందులో భాగంగానే అమిత్ షా కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించారు.
 
ఎంఐఎంకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ఎందుకు భయపడుతున్నారని, గ‌తంలో హిందూ దేవతలను అవమానిస్తూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ మాట్లాడినా తెలంగాణ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోలేద‌న్నారు. కెసిఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదని ఆయన ధ్వజమెత్తారు. ఇటువంటి అసమర్థ పాలనను మళ్లీ రానివ్వవద్దని విజ్ఞప్తి చేసుకుంటూ ఆయన పై మాటల తూటాలు పేల్చారు. కాంగ్రెస్, టిడిపి, టిఆర్ఎస్ వీరందరిలో ఎవరు తెలంగాణలో అభివృద్ధి చేసి చూపించలేదని, తమకు ఒక్క అవకాశం ఇస్తే బిజెపి సత్తా ఏంటో చూపిస్తామని నిర్మల్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన అన్నారు.
 Top