జగన్ ముంగిట్లో ఆసక్తికర నిర్ణయం..!

By Xappie Desk, November 26, 2018 20:22 IST

జగన్ ముంగిట్లో ఆసక్తికర నిర్ణయం..!

ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో జగన్ తన రాజకీయ జీవితంలోనే ఒక కీలక ఘట్టాన్ని ఎదుర్కొంటున్నాడు అనే చెప్పాలి. మొదటి నుండి ప్రత్యేక హోదా మీద పట్టుదల గా వ్యవహరిస్తుంది జగన్మోహన్ రెడ్డి నే. ప్రస్తుతం చంద్రబాబు ఓటమే ధ్యేయంగా పాదయాత్ర పేరుతో జనం లోకి వెళుతున్న జగన్ మరోవైపు రాష్ట్రంలో తన పార్టీ బలాన్ని పెంచేందుకు సర్వత్రా కృషి చేస్తున్నారు. క్రితంసారి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన స్థానాల్లో గణనీయమైన ఓట్లతో కొన్ని స్థానాలు గెలుచుకున్న జగన్ ఈసారి మాత్రం అసలు పోటీకే దిగలేదు. అతని తండ్రి రాజశేఖర్ రెడ్డి కి ఉన్న సానుకూలత తో, అలాగే రెడ్డి సామాజిక వర్గం మద్దతుతో క్రితం సారి ఆయన కొన్ని సీట్లు గెలుపొందారు. అయితే ఇక్కడ జగన్ కి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది.
తెలంగాణలో ప్రచారంలో భాగంగా వచ్చిన సోనియా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూ తాము ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో ప్రత్యేక హోదా సెంటిమెంటు బలంగా పని చేయనుంది. ప్రజలకు ఎవరైతే హోదా తీసుకు వస్తారని నమ్మకం ఉంటుందో వారి వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. అసలు బిజెపి మాత్రం ప్రత్యేక హోదా ఇచ్చే సమస్య లేదని తేల్చి చెప్పేసింది. ఇంకొక పక్క చంద్రబాబు జగన్ భాజపా తో కలిసి రాజకీయాలు నడుపుతున్నారని విపరీతంగా ప్రచారం చేస్తున్నాడు.
అయితే జగన్ మాత్రం ఎప్పటినుండో రాష్ట్రానికి హోదా ఏ పార్టీ ఇస్తే వాళ్లతో కలవడానికి తాము సిద్ధమని ప్రకటించేశారు. ఇదే విషయాన్ని వైసిపి ప్రముఖులు కూడా పలుమార్లు ప్రస్తావించారు. ఈ విషయమై తన ఎమ్మెల్యేలతో, ఎంపీలతో రాజీనామాలు, బహిష్కరణలు కూడా చేయించారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కేంద్రంలోని రెండు పెద్ద పార్టీలు బిజెపి ఇప్పటికే ప్రత్యేక హోదా మీద చేతులెత్తేసింది. కాంగ్రెస్ మాత్రం తమ తప్పక ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించేశారు. చంద్రబాబు హోదా విషయంలో మొదటి నుండి అవకాశవాదంగా ఉంటే ఒకే నిర్ణయం మీద ఉన్న జగన్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. చంద్రబాబు హోదా ఇస్తానంటున్న కాంగ్రెస్ కు జై కొడుతుంటే జగన్ కూడా అదే పార్టీకి మద్దతు పలికే అవకాశం లేదు. ఇటువంటి క్లిష్టతరమైన రాజకీయ నేపథ్యంలో జగన్ ముంగిట ఒక వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ నిర్ణయమే రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ రాతను రాస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.Top