వరంగల్ లో ఊసరవెల్లి రాజకీయం..! తరాలుగా ఇదే కాంగ్రెస్ తీరు..!

By Xappie Desk, November 27, 2018 20:01 IST

వరంగల్ లో ఊసరవెల్లి రాజకీయం..! తరాలుగా ఇదే కాంగ్రెస్ తీరు..!

అందరూ బండ్లు ఓడలు ఓడలు బండ్లు అవుతుంటాయి అనే సామెతను వాడుతారు. అయితే మన రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఎప్పటికైనా బండ్లు బండ్లే ఓడలు ఓడలే అని మరోసారి రుజువైంది. రోజులు గడుస్తున్నాయి, అధికారాలు మారుతున్నాయి కానీ అవకాశవాద రాజకీయాలు ఊసరవెల్లి ముసుగులు మాత్రం ఎప్పటికీ అలాగే ఉండిపోతున్నాయి. ఇదంతా చెప్పేది తెలంగాణలో ముందస్తు ఎన్నికలు భాగంగా పశ్చిమ వరంగల్ టికెట్ కి జరిగిన డ్రామా గురించి. మహా కూటమి ఇప్పటివరకు కాంగ్రెస్ కి ఎంత మేలు చేసిందో తెలియదు కానీ ఈ నియోజకవర్గంలో మాత్రం వారి స్థిరత్వం కూటమి వల్ల బీటలు వారింది.
అసలు విషయం ఏమిటంటే అందరూ ముందుగా అనుకున్నట్టు పశ్చిమ వరంగల్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి నాయని రాజేందర్ రెడ్డి పోటీ చేయాల్సి ఉంది. కానీ కూటమి ఏర్పడిన తర్వాత అధిష్టానం మాత్రం మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దీటైన అభ్యర్థికి టీడీపీ కి చెందిన రేవూరి ప్రకాశ్రెడ్డిని సరైన ప్రత్యర్థిగా భావించి చివరి నిమిషంలో టికెట్ కన్ఫర్మ్ చేసింది. దీంతో కోపంతో రగిలి పోయినట్లుగా వ్యవహరించిన రాజేందర్ రెడ్డి పార్టీ టికెట్ ఇస్తానన్నా.... ఇవ్వనాన్నా తాను పోటీ చేసేది చేసేదే అని ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. అసలు ఒక టీడీపీ అభ్యర్థికి, అదీ కాకుండా స్థానికేతరుడు కి టికెట్ ఇవ్వడం దిగజారుడు రాజకీయమని అధిష్టానాన్ని తీవ్రంగా విమర్శించాడు. తనకి గురువులు అంటే ఎవరూ లేరని నమ్ముకున్న వారే పంగనామాలు పెడుతున్నారని తన గోడును జనాలముందు వెళ్లగక్కి కొద్ది రోజులు నిరాహార దీక్ష కూడా చేశారు. డిసిసి ప్రెసిడెంట్ గా ఉండి కూడా ఏం చేయలేక పోతున్నా తనకు ఇక నుండి ప్రజలే హైకమాండ్ అని ఒక రేంజ్ లో వార్ కు దిగారు. తమ కార్యకర్తల్లో, నియోజకవర్గంలో ఎనలేని సపోర్ట్ సంపాదించిన తనని వదిలేసి ప్రకాశ్ రెడ్డి కి టికెట్ ఇవ్వడం ఏమిటంటూ... ఏదో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే సత్తా తనకు ఉన్నట్లు బిల్డప్ ఇచ్చారు.
కాలం గడిచింది ఎన్నెన్నో చర్చలు సమావేశాల నడుమ కొద్దిరోజుల తర్వాత సీన్ చూస్తే అతడి కోసం ర్యాలీ నిర్వహించిన కార్యకర్తలు ఏడ్చి పెడబొబ్బలు పెట్టిన మహిళలు విస్తుపోయేలా తిరిగి ప్రకాష్ రెడ్డి కోసం ప్రచారంలో వీధులు వీధులు తిరుగుతున్నారు. అసలు వరంగల్ లో ఎన్ని గోతులు ఉంటాయో కూడా తెలియని నేతలకు ఎలా టికెట్ ఇస్తారని చెప్పిన ఇతను ఇప్పుడు అతనితో కలిసి ఎక్కడెక్కడ గోతులు ఉంటాయో బాగా విడమరిచి చూపిస్తున్నారు. ఇక మన ప్రకాష్ రెడ్డి కూడా తక్కువైన వాడు ఏమీ కాదు...రాజేందర్ రెడ్డి ఎదురుతిరిగిన నేపద్యంలో ఈయన అతను ఒక అసమర్థ రాజకీయ వ్యాఖ్యానించి ఇప్పుడు అదే అసమర్థ నాయకుడిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ అసలు సిసలైన రాజకీయ నాయకుడిని అని నిరూపించుకున్నారు.
మునుపు కొట్టుకున్న ఇద్దరూ కలిసి చెట్టపట్టాలేసుకొని ఓట్లు గాలింపులో ఉన్నారు. అయినా ఇటువంటి రంగులు మార్చే రాజకీయం గురించి ఎక్కువ చర్చించుకోకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు భుజాల మీద ఉన్న కండువాలను చూస్తే అర్థమవుతుంది ఇష్టం వచ్చిన రంగులు మార్చుకోవడానికి సిద్ధంగా ఒక ఊసరవెల్లి ఎలా ఉంటుందో.
ప్రజాసమస్యలు తెలుసుకోవడానికి వెళ్తున్న వీళ్ళిద్దరినీ చూసి అసలు వారి కార్యకర్తలకే ఎవరికి మద్దతు పలకాలో సమస్యగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. కలిసి తిరగడానికి వారికి ఎలా ఉన్నా వెంటనే వర్గం మార్చి జై కొట్టడానికి వాళ్లకు ఏదోలా ఉందట. మరి రాబోయే తరాల్లో కాబోయే రాజకీయ నాయకులు వీరి నుంచి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది కదా. ఇక రాబోయే రోజుల్లో మన పిల్లలు ఎవరైనా అడిగితే హస్తం గుర్తులోని ఐదు వేళ్ళు... ఒక్కొక్క వేలు... ఒక్కొక్క రంగు కి ప్రతీక అని మన జీవితం రంగులమయం చేయడానికి వాళ్లు రంగులు మారుస్తూ ఉంటారు అని భవిష్యత్తులో చెప్పాలి.Top