ప్రచారం కొద్ది సేపటిలో ముగుస్తుండగా లగడపాటి రాజగోపాల్ సర్వే సోషల్ మీడియాలో వైరల్..

By Xappie Desk, December 05, 2018 11:21 IST

ప్రచారం కొద్ది సేపటిలో ముగుస్తుండగా లగడపాటి రాజగోపాల్ సర్వే సోషల్ మీడియాలో వైరల్..

మరికొద్ది గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ప్రచారం ముగియనున్న నేపథ్యంలో లగడపాటి రాజగోపాల్ నిర్వహించిన సర్వే అంటూ సోషల్ మీడియాలో వచ్చిన ఫలితాలు చూసి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు మరియు ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియా లో విడుదలయిన లగడపాటి రాజగోపాల్ సర్వే ఫలితాల చూస్తే తెలంగాణ రెండో అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ కి విజయం అంత ఈజీగా రావడం కష్టమే అని తెలుస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో అత్య‌ధిక అసెంబ్లీ సీట్లు ఉండ‌గా ఆ ప్రాంతాలలో మహా కూటమి అత్యధికంగా సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నట్లు లగడపాటి సర్వే ద్వారా తేలింది. ఇదే క్రమంలో ఎప్పటిలాగా టిఆర్ఎస్ పార్టీకి వరంగల్ జిల్లాలో తిరుగులేదని మరోసారి ఈ సర్వేలో తేలింది.
 
అంతేకాకుండా కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో టీఆర్ఎస్, కాంగ్రెసు మధ్య తీవ్ర‌మైన పోటీ ఉంటుంద‌ని తెలుస్తోంది. హైదరాబాద్‌లో మజ్లీస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని.. అక్క‌డ 15 అసెంబ్లీ స్థానాలు ఉండ‌గా.. మ‌జ్లీస్ 7 సీట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని, మిగిలిన 8 సీట్లు ఇత‌ర పార్టీల‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచ‌రం. దీంతో ఈ స‌ర్వే ప్ర‌కారం చూస్తే.. టీఆర్ఎస్‌కు గ‌ట్టి దెబ్బే అని తెలుస్తోంది. అయితే ఈ ల‌గ‌డ‌పాటి స‌ర్వే లీకుల పై టీఆర్ఎస్ నేత కేటీఆర్ స్పందించారు.
 
ల‌గ‌డ‌పాటి స‌ర్వే అంటూ ఇస్తున్న లీకుల్లో నిజం లేద‌ని.. లగడపాటి రాజగోపాల్ తనకు న‌వంబ‌ర్ 20వ తేదీన మెసేజ్ పంపించారని, అందులో టీఆర్ఎస్‌కు 65 నుండి 70 సీట్లు వ‌స్తాయ‌ని తెలిపార‌ని కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో సాక్ష్యాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టారు. మ‌రి న‌వంబ‌ర్ 20వ తారీకు వ‌ర‌కు టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ‌చ్చిన ల‌గ‌డ‌పాటి స‌ర్వే రిజ‌ల్ట్ ప‌దిరోజుల్లో ఎలా తారుమారు అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని కేటీఆర్ అన్నారు. కేవలం ఇటువంటివి ప్రజల దృష్టిని మలచడానికి కొన్ని దుష్ట రాజకీయ శక్తుల ఆడుతున్న డ్రామా అని పేర్కొన్నారు.Top