తెలంగాణా ఓట్ల గల్లంతు అతి పెద్ద కుట్ర ?

By Xappie Desk, December 09, 2018 15:32 IST

తెలంగాణా ఓట్ల గల్లంతు అతి పెద్ద కుట్ర ?

ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను ముందుగానే గుర్తించిన టీఆర్ఎస్ పార్టీ దాని అధినేత ప్లాన్ బీ అమ‌లు చేశారా? ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న‌కు ముందే… పోలింగ్‌కు చాలా కాలం ముందుగానే ప్లాన్ బీని అమ‌లు చేసి ఏమీ తెలియ‌న‌ట్లు ఎన్నిక‌ల‌కు వెళ్లారా? త‌మ‌కు వ్య‌తిరేకంగా ఉన్న ప్రాంతాల‌ను గుర్తించి.. వ్య‌తిరేకంగా ఉన్న ఓటర్ల‌ను గుర్తించి ముందుగానే వేటు వేశారా? ఈ ప్ర‌శ్న‌ల‌కు కాంగ్రెస్ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. త‌మ‌కు వ్య‌తిరేకంగా జ‌నం తిర‌గ‌బ‌డ‌డం ఖాయ‌మ‌ని గుర్తించిన టీఆర్ఎస్ నేత‌లు ముందుగానే అలాంటి వ్య‌తిరేక ఓట్ల‌ను తీసేయించార‌ని కాంగ్రెస్ తీవ్రంగా ఆరోపిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం.. దాన్ని వినియోగించుకోవడం పౌరుల హక్కు.. ఎన్నికల సంఘం పదేపదే చెప్పే మాట ఇది. కానీ కొంద‌రి నుంచి అంటే ఏకంగా ల‌క్ష‌ల మంది నుంచి ఆ వ‌జ్రాయుధాన్ని ముందే లాగేసుకుని ఓటింగ్ రోజు ఆయుధం లేని సైనికుడిని చేశార‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.
&nbp;
ఓటు వేయకుంటే ప్రశ్నించే హక్కును కోల్పోతారని ప్రముఖులతో విస్తృతంగా ప్రచారం చేయించిన ఎన్నిక‌ల సంఘం ల‌క్ష‌ల మందికి ఆ ఓటు హ‌క్కే లేకుండా చేసింది. చేతిలో ఓట‌రు గుర్తింపు కార్డు ఉన్నా.. జాబితాలో ఓటు లేక‌పోవ‌డంతో అనేక ప్రాంతాల‌లో ప్ర‌జ‌లు నిర‌స‌న‌లు వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల సంఘం వెబ్‌సైట్లో ఓటు ఉందో లేదో చెక్ చేసుకుని ఉంద‌ని తెలుసుకుని ఓటు వేసేందుకు వెళ్లిన జ‌నానికి కూడా పోలింగ్ బూత్‌లో నిరాశ తప్ప‌లేదు. చాలా చోట్ల ఈసీ వెబ్‌సైట్‌లో ఉన్న ఓటు తీరా పోలింగ్ బూత్‌లో ఉన్న జాబితాలో మిస్ప‌య్యింది.
&nbp;
దీని వెనుక భారీ కుట్ర ఉంద‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌జ‌ల ఓట్లు ల‌క్ష‌ల్లో గ‌ల్లంతైనా ఎన్నిక‌ల సంఘం మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రించింది. ఓటు ప్రాముఖ్యతను తెలియజేస్తూ, ప్రజల బాధ్యతను గుర్తుచేస్తూ ఈసీ చేసే ప్రచారానికి.. చేస్తున్న ఏర్పాట్లకు పొంతనే ఉండట్లేదు.
&nbp;
ఎన్నికలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం అన్ని రంగాల్లో విఫలమైంది. లక్షలాది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయేందుకు కారణమైంది. శాసనసభ రద్దయిన సెప్టెంబరు 6 నుంచే ఈసీ ఓటర్ల జాబితాపై దృష్టి సారించింది. అర్హులందరి పేర్లు ఓటర్ల జాబితాలో చేర్చాలన్న లక్ష్యంగా నవంబరు 9 వరకు దరఖాస్తులను స్వీకరించి ముసాయిదా జాబితాను నవంబరు 25న విడుదల చేసింది. దాదాపు 20 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. వీటన్నిటినీ క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి కనీసం 60 రోజులు పడుతుంది.
&nbp;
కానీ, ఈసీ ఈ ప్రక్రియను 15 రోజుల్లోనే ముగించింది. దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు సిబ్బందికి సమయం లేకుండా పోయింది. ఇక్క‌డే పౌరుల‌కు అన్యాయం జ‌రిగింది. చాలాచోట్ల రాజకీయ ఒత్తిళ్లతో ప్రత్యర్థి పార్టీల మద్దతుదారుల పేర్లను గంపగుత్తగా తొలగించారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల్లో 13లక్షలు మాత్రమే చేర్చారు. మిగతా 7లక్షలకు పైగా ఏమయ్యాయన్నది ప్రశ్నగానే మిగిలిపోయింది.
సెప్టెంబ‌రు 25నాటికి దరఖాస్తు చేసినవారి పేర్లన్నీ అక్టోబరు 12న విడుదల చేసిన జాబితాలో చేర్చామని ఈసీ ప్రకటించింది. కానీ, ఈ జాబితాలోని పేర్లన్నీ వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ కాలేదు. మొబైల్‌ యాప్‌లో పేర్లుండి.. పోలింగ్‌ కేంద్రంలో లేకపోవడంతో చాలామంది ఓటు వేయలేకపోయారు. కొందరి పేర్లు వెబ్‌సైట్‌లో రికార్డయినా బూత్‌లకు పంపిన జాబితాల్లో మిస్సయ్యాయంటూ సీఈవో రజత్‌కుమార్‌ ఓటర్లకు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ఒక ఓటరు పేరు ఒకేచోట ఉండాలన్న లక్ష్యంగా ఈసీ అనేక చర్యలు తీసుకున్నా అవి నిష్ఫలమయ్యాయి. వీటికోసమే ప్రత్యేకంగా ఈసారి ఈఆర్వోనెట్‌ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించారు.
&nbp;
సాంకేతిక సమస్యలతో ఇది పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదు. దీంతో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో రెండేసి ఓట్లున్నవారు పెద్దసంఖ్యలో ఉండిపోయారు. ఇలా ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో పక్కనే ఉన్న నల్లగొండతోపాటు ఇతర జిల్లాలకు చెందిన 42వేల మంది ఓటర్లున్నారు.
&nbp;
జీహెచ్‌ఎంసీ పరిధిలో పోలింగ్‌ శాతం తగ్గడానికి ఇది కూడా ఓ ప్రధాన కారణంగా నిలిచింది. ఓటర్ల జాబితాపై కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఆది నుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. లక్షల సంఖ్యలో నిజమైన ఓటర్ల పేర్లను ఇష్టారాజ్యంగా తొలగించారని చెబుతూనే ఉన్నారు. శాసనసభ రద్దయిన వెంటనే హైకోర్టును కూడా ఆశ్రయించారు. అన్నీ సరిచేస్తున్నామని చెప్పిన ఈసీ.. సమస్యలను పరిష్కరించకుండానే ఎన్నికల ప్రక్రియను ముగించింది. ఇక్క‌డే అధికార పార్టీ దుర్వినియోగం… అక్ర‌మాల‌కు ఆస్కారం ఏర్ప‌డింద‌ని కాంగ్రెస్ తీవ్రంగా మండిప‌డుతోంది.
&nbp;
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop