జగన్ కి కెసిఆర్ తో అవసరం లేదు !

By Xappie Desk, January 01, 2019 22:52 IST

జగన్ కి కెసిఆర్ తో అవసరం లేదు !

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ఈ నెల 9వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనున్నట్లు ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… 2017 నవంబర్ 6 ప్రారంభమైన జగన్ పాదయాత్ర మూడు క్యాలెండర్ సంవత్సరాల్లో కొనసాగిందన్నారు. పాదయాత్ర మొత్తం 134 నియోజకవర్గాల్లో, 230 మండలాల్లో కొనసాగిందన్నారు. ఇప్పటికే 3,574 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయ్యిందని, మరో 100 కిలోమీటర్లు కొనసాగనుందని తెలిపారు.

జగన్ పాదయాత్రకు సంఘీభావంగా ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు ప్రతి నియోజకవర్గంలో రోజుకు రెండు గ్రామాల చొప్పున సభలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలు, జగన్ వస్తే చేసే కార్యక్రమాల గురించి ప్రజలకు సమన్వయకర్తలు వివరిస్తారని తెలిపారు. తర్వాత అన్ని నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు, శ్రేణులతో ఇచ్ఛాపురంలో జనవరి 9న ముగింపు సభకు హాజరవుతారని పేర్కొన్నారు. పాదయాత్ర ముగిశాక కూడా జగన్ ప్రజల్లోనే ఉంటారన్నారు. ఇక కేసీఆర్ తో జగన్ కలుస్తారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కేసీఆర్ తో కలవాల్సిన అవసరం తమకు లేదని, కాకపోతే ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపిన కేసీఆర్ ప్రకటనను మాత్రం స్వాగతిస్తామని స్పష్టం చేశారు.Top