పన్నెండు రోజుల్లో ఎన్నికలు - తెరాస vs కాంగ్రెస్ - రసకందాయం లో రాజకీయం !

By Xappie Desk, November 25, 2018 21:54 IST

పన్నెండు రోజుల్లో ఎన్నికలు - తెరాస vs కాంగ్రెస్ - రసకందాయం లో రాజకీయం !

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో బరిలో నిలుస్తున్న ఆయా పార్టీలు తమ అస్త్రాలకు పదునుపెడుతున్నాయి. ఒక పార్టీపై మరో పార్టీ ఇరుకున పెట్టే వ్యూహం అమలు చేస్తోంది. ఈ క్రమంలో చార్జిషీట్ల పేరుతో ఆరోపణల పర్వం తెరమీదకు వస్తోంది. తాజాగా ఇదే రీతిలో కాంగ్రెస్ పార్టీ చార్జిషీట్ విడుదల చేయగా టీఆర్ఎస్ పార్టీ అందుకు కౌంటర్ షీట్ అంటూ వివరాలు వెల్లడించింది. శనివారం గాంధీభవన్‌లో యాంటీ పీపుల్ గవర్నమెంట్ పేరిట కేసీఆర్ అవినీతి పై కాంగ్రెస్ చార్జిషీట్ విడుదల చేసింది. కేసీఆర్ ప్రభుత్వ నాలుగున్నరేండ్ల పాలనలో కేసీఆర్ అవినీతి పై 24 అంశాలతో కూడిన చార్జిషీట్ ను వెల్లడించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రామచంద్రకుంతియా మాజీ ఎంపీ మధుయాష్కి ఎన్నికల ప్రచార కమిటీ కన్వీనర్ డాక్టర్ దాసోజు శ్రవణ్ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ఉన్నారు.
 
అపద్ధర్మ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అవినీతికి రారాజు అందులో ఆయన దేశంలోనే రెండో స్థానంలో నిలిచారని ఏఐసీసీ మీడియా ఇన్చార్జి రణదీప్‌సింగ్ సూర్జేవాలా విమర్శించారు. అవినీతి పరుల్లో దేశంలోనే కేసీఆర్ రెండో స్థానంలో నిలిచారని మొదటి స్ధానం ప్రధానమంత్రి మోడీదే నని ఆరోపించారు. టీఆర్ఎస్ ఒక ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ దాని అక్రమాలకు అంతులేదని వ్యాఖ్యానించారు. ఇసుక మాఫియా మియాపూర్ భూకుంభకోణం పోలీస్ వాహనాల కొనుగోలులో గోల్ మాల్ అటవీశాఖ భూములను టీఆర్ఎస్ ఎంపీ కె కేశవరావుకు అప్పగించారని చెప్పారు. కేసీఆర్ కమీషన్ల కోసమే మిషన్‌భగీరథ కాకతీయ వంటి కార్యక్రమాలు చేపట్టారని విమర్శించారు. భారీనీటిపారుదల ప్రాజెక్టుల పేరిట వేల కోట్ల రూపాయలను దోచుకున్నారని చెప్పారు. కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తానని అందరినీ నమ్మించి తన కుటుంబాన్ని మాత్రం బంగారు మాయం చేసుకున్నారని మండిపడ్డారు. నాలుగున్నరేండ్లుగా తెలంగాణ ప్రజల ఆశలను వమ్ము చేసిన కేసీఆర్ పాలనకు చరమ గీతం పాడబోతున్నామని తెలిపారు. టీఆర్ఎస్ బీజేపీ లోపాయికారి ఒప్పందాల ద్వారా ప్రజలను మోసగిస్తాన్నారని చెప్పారు. టీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనన్నారు. దేశంలో మోడీ రాష్ట్రంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. టీఆర్ఎస్ కార్లో కేసీఆర్ కేటీఆర్ కవిత సంతోష్‌రావు తన్నీరు హరీష్‌రావులకే చోటు ఉందని అందులో తెలంగాణ ప్రజలకు చోటు దక్కలేదన్నారు. ప్రజలకుచోటు లేని కారు బేకారు అందుకే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించాలన్నారు
 
కాగా టీఆర్ఎస్ పార్టీ దీని పై ధీటుగా స్పందించింది. అభివృద్ధి సంక్షేమ పథకాలతో రాష్ర్టాన్ని ప్రగతిపథంలో పరుగులుతీయిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అసంబద్ధమైన చార్జిషీట్ విడుదలచేసి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నదని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. ఏటా సగటున 17 నుంచి 18 శాతం వృద్ధిరేటు నమోదుచేసుకొంటున్న తెలంగాణ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదునెలల్లో 21 శాతం వృద్ధిరేటుతో దేశంలోనే అగ్రగామిగా సత్తా చాటుకోవడం కాంగ్రెస్ నేతలకు కనిపించడంలేదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆరు దశాబ్దాల సుదీర్ఘ పాలనలో కేవలం 42.57 లక్షల ఎకరాలకు సాగునీరు అందించగలిగిన కాంగ్రెస్ టీడీపీ పాలకులు కేవలం నాలుగున్నరేండ్లలోనే 26.69 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి కల్పించిన టీఆర్ఎస్ను నిందించడం పట్ల జనం విస్మయకరమని పేర్కొన్నారు. తమ హయాంలో రైతులకు కరంట్ కోతలతో వాతలుపెట్టిన కాంగ్రెస్ నేతలకు నేడు దేశంలో ఎక్కడా లేనివిధంగా వ్యవసాయానికి ఉచితంగా 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వేలెత్తిచూపే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. ఈ మేరకు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. నీళ్లు నిధులు నియామకాలు అనే ప్రధాన నినాదంతో సాధించుకున్న తెలంగాణలో ఈ మూడు లక్ష్యాల సాధనకు నిరంతరం శ్రమిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ విభాగాల్లో లక్ష ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇవ్వడంతోపాటు ఇప్పటికే 32681 పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే. గత నాలుగున్నరేండ్లుగా రాష్ట్రం సొంత రాబడులను గణనీయంగా పెంచుకొంటూ బెస్ట్ ఎకనమిక్ స్టేట్ గా దేశంలోనే తనదైన ముద్రను వేసుకొందని పేర్కొంది. పారదర్శకమైన విధానాలతో రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్టవేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో పదేండ్లపాటు మొత్తం రూ.9.56 కోట్లుగా ఉన్న ఆదాయాన్ని నాలుగేండ్లలో రూ. 2012.84 కోట్లకు పెంచిన విషయాన్ని విస్మరించి కాంగ్రెస్ నేతలు పసలేని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉన్నదని ప్రజలు అంటున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యారంగానికి పెద్దపీట వేయడంతోపాటు కేజీ టు పీజీ ఉచితవిద్య పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన ఉపాధ్యాయుల నియామకాలు డిజిటల్ తరగతులతో నాణ్యమైన విద్యను అందజేయడాన్ని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు.Top