గత సంవత్సరం అక్టోబర్ మాసంలో విశాఖపట్టణం విమానాశ్రయంలో ప్రతిపక్షనేత వైసీపీ నేత జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ముగించుకుని సీబీఐ కోర్టుకు వెళ్లాల్సిన క్రమంలో విమానాశ్రయంలో ఆయనపై శ్రీనివాస్ అనే వ్యక్తి కోడి కత్తితో దాడి చేయడం జరిగింది. ఈ ఘటన 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రాన్ని కూడా షాక్ కి గురి చేసింది. అయితే జగన్ పై కావాలని తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు హత్యాయత్నం జరిపించారని ముఖ్యంగా జగన్ పై దాడికి పాల్పడిన వ్యక్తి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరుడైన హర్షవర్ధన్ చౌదరి కి సంబంధించిన క్యాంటీన్లో పనిచేస్తున్నారని అప్పట్లో కామెంట్లు చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల ఈ కేసు అంశాన్ని హైకోర్టు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ కు అప్పగించిన విషయం మనకందరికీ తెలిసినదే.
ఈ క్రమంలో విశాఖ ఎయిర్ పోర్ట్ లోని క్యాంటిన్ ఓనర్ హర్షవర్దన్ తో పాటు శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడిన 10 మంది మహిళల పాత్ర ఏంటి అన్న దానిపైనా ఆరా తీస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. ఇక ఈ కేసులో భాగంగా, దాడి జరిగిన సమయంలో అక్కడ ఉన్న వైసీపీ నేతలు, కార్యకర్తలను కూడా సాక్షులుగా పేర్కొంటూ ఎన్ఐఎ అధికారులు నోటీసులు పంపించారు. దీంతో వైసీపీ కార్యాలయంలో పనిచేసే కృష్ణకాంత్, మాజీ కార్పొరేటర్ జియ్యాని శ్రీధర్ రెండు రోజులక్రితం విచారణకు హాజరయ్యారు. ఇక నోటీసులందుకున్న మిగతా వైఎస్సార్‌సీపీ నేతలు కూడా రెండు రోజుల్లో విచారణకు హాజరవుతామని సమాచారమిచ్చారు. అయితే ఈ కేసులో కీలకంగా భావిస్తున్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమానికి, టీడీపీ నేత హర్షవర్దన్ చౌదరి ఎన్ఐఎ విచారణకు హాజరు కాలేదని.. అతను కనిపించడం లేదని.. కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే.. హర్షవర్ధన్ ఫోన్ స్విఛ్ఆఫ్ వస్తుందని సమాచారం.