పథకం ప్రకారమే జగన్ పై దాడి జరిగింది..?

Written By Xappie Desk | Updated: February 01, 2019 14:32 IST
పథకం ప్రకారమే జగన్ పై దాడి జరిగింది..?

వైసీపీ పార్టీ అధ్యక్షుడు ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై గత సంవత్సరం అక్టోబర్ మాసంలో విశాఖపట్టణం విమానాశ్రయంలో కోడి కత్తితో శ్రీనివాస్ అనే వ్యక్తి దాడిచేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో కలకలం సృష్టించింది. ఈ సందర్భంగా వైసీపీ పార్టీకి చెందిన నేతలు కావాలనే అధికార పార్టీ టిడిపి పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక జగన్ ని హతం చేయాలని చూసిందని కామెంట్లు చేశారు. అయితే ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ పథకం ప్రకారమే జగన్ పై దాడి జరిగిందని పేర్కొన్నట్లు సమాచారం.
 
జగన్ ఆ దాడి గురి తప్పకపోయుంటే మరణం సంభవించి ఉండేదని, అందుకే జగన్‌పై జరిగిన దాడిని రాష్ట్ర పోలీసులు హత్యాయత్నంగా పరిగణిస్తూ, ఆ మేరకు ఐపీసీ సెక్షన్‌ 307 కింద కేసు నమోదు చేశారని వివరించిందని కూడా ఎన్.ఐ.ఎ. పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఈ కేసును తీసుకోవలసిన పరిస్థితి గురించి కూడా ఎన్.ఐ.ఎ. కోర్టుకు వివరించింది. జగన్‌పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్‌ఎఫ్‌), ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ), ఎన్‌ఐఏలు ఇచ్చిన సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, విశ్లేషించిన తర్వాతే ఇది పౌర విమానయాన చట్టం కింద చట్ట వ్యతిరేక కార్యకలాపాల పరిధిలోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక అభిప్రాయానికి వచ్చిందని ఎన్‌ఐఏ తెలిపింది.
 
ఇందుకు అనుగుణంగానే ఈ ఘటనపై దర్యాప్తును తమకు అప్పగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొంది.రాష్ట్ర ప్రభుత్వం డాక్యుమెంట్లు ఇవ్వని విషయాలను కూడా ఎన్.ఐ.ఎ. కోర్టుకు తెలియచేసింది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , డిజిపిలు జగన్ పై జరిగిన దాడిని అబిమాని చేసిందని, డ్రామా అని చెప్పడం వివాదం అయిన సంగతి తెలిసిందే.
Top