ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే చాలా మంది తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఇతర పార్టీలో చేరుతున్నారు. గత నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉండి తాజాగా ఎన్నికలు వస్తున్న క్రమంలో టీడీపీకి చెందిన నాయకులు ఇతర పార్టీల వైపు చూడటం ప్రస్తుత రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ మారుతున్న నాయకుల పట్ల సహనం చెందుతున్నట్లు సమాచారం. ఇప్పటికే టీడీపీ నుండి గుంటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు తన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు.
ఈ క్రమంలో తాజాగా రాజంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అలాగే జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య విభేదాల కారణంగా, అక్కడ పలువు టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరడం జరిగింది. ఇక ముఖ్యంగా టీడీపీ నేత వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్నం కూడా వైసీపీలో చేరడంతో టీడీపీలో ఒక్కసారిగా కలకలం రేపుతోంది. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలువురు ముఖ్య నేతలు పార్టీలో చేరుతుండడంతో ప్రతిపక్ష వైసీపీ బలం పుంజుకుంటుండగా, మరోవైపు టిడిపికి చెందిన నేతలు మరియు కార్యకర్తలు గ్రూపు రాజకీయాలతో తగాదాలు పెట్టుకొని టిడిపి గ్రాఫ్ నూ మరింత దిగజారుస్తున్నారు.