రైతులపై వరాల జల్లు కురిపిస్తున్న ప్రభుత్వాలు..!

By Xappie Desk, February 02, 2019 11:26 IST

రైతులపై వరాల జల్లు కురిపిస్తున్న ప్రభుత్వాలు..!

భారతదేశానికి వ్యవసాయం వెన్నెముక లాంటిది. ఈ విషయం దేశంలో ఉన్న చాలా పార్టీలకు తెలుసు. ముఖ్యంగా రైతుని ఆకట్టుకుంటే కచ్చితంగా అధికారంలోకి వెళ్లవచ్చని చాలా పార్టీలకు చెందిన నేతలు అధ్యక్షులు వ్యవసాయ రంగంపై మరియు రైతులపై ఎన్నికల సమయంలో వరాల జల్లు కురిపిస్తుంటారు. ఈ క్రమంలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. రైతాంగం, మధ్యతరగతి, వ్యాపారులకు ఊరటనిచ్చేలా ఈ బడ్జెట్‌లో కేంద్రం వరాలను ప్రకటించే అవకాశం ఉందని.. ఇప్ప‌టికే విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోరైతులకు ఆదుకునేందుకు కేంద్ర బడ్జెట్ భారీ పథకాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు తరహాలోనే రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్రం ప్రకటించింది. ఈ నేప‌ధ్యంలో ఇటీవల లోక్ సభలో కేంద్రమంత్రి పియూష్ గోయల్ బడ్జెట్‌లో భాగంగా ఈ పథకాన్ని ప్రకటించారు. దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు ఆదుకునేందుకు గానూ ఈ పథకానికి 75 వేల కోట్లు కేటాయించారు. 2018 డిసెంబర్ 1 నుంచే ఈ పథకం ప్రారంభమైనట్లు ప్రకటించారు. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఏటా 6 వేల నగదు నేరుగా వారి ఖాతాల్లోకి మూడు విడతల్లో పంపించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి కలగనుందని స‌మాచారం. అయితే ఈ ప్రకటన విన్న కొంతమంది ఇటువంటివి అధికారంలోకి వచ్చిన తరువాత రోజు నుండే మొదలు పెడితే బాగుంటుందని ఎన్నికల సమయంలో ఇంత దారుణంగా అధికారం కోసం ప్రకటించడం సిగ్గుచేటంటూ మండిపడుతున్నారు.


Tags :


Top