అన్నీ వదులుకుని త్యాగాలు చేసి రాజకీయాల్లోకి వచ్చాను అంటున్న లోకేష్..!

Written By Xappie Desk | Updated: February 11, 2019 11:46 IST
అన్నీ వదులుకుని త్యాగాలు చేసి రాజకీయాల్లోకి వచ్చాను అంటున్న లోకేష్..!

ఏపీ మంత్రి నారా లోకేష్ ఇటీవల గుంటూరులో జరిగిన ప్రధాని మోడీ సభపై సంచలన కామెంట్లు చేశారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించడానికి అప్పట్లో బిజెపి పార్టీ కూడా సహకరించిందని మాట్లాడుతూ మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శల వర్షం కురిపించారు. గత సార్వత్రిక ఎన్నికలలో కలిసి పోటీ చేసి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి పార్టీ రాష్ట్రానికి అన్ని విషయాల లోనూ మొండిచేయి చూపించిందని పేర్కొన్నారు. ముఖ్యంగా గుంటూరు సభలో చంద్రబాబు ప్రభుత్వం పై అవినీతి ఆరోపణలు చేసిన ప్రధాని మోడీకి నారా లోకేష్ సవాలు విసిరారు. టిడిపి అవినీతికి పాల్పడినట్లు ఒక్క రుజువైనా చూపగలరా అని ఆయన ప్రశ్నించారని వార్తలు వచ్చాయి.
 
ప్రత్యేకహోదా గురించి ఒక్కమాట మాట్లాడలేదని, రైల్వే జోన్‌, కడప ఉక్కు పరిశ్రమ ఆయనకు గుర్తుకే రావా? అని ఆయన అన్నారు. ప్రధాని సభకు వైకాపా నేతలు జనసమీకరణ చేశారని లోకేశ్‌ ఆరోపించారు. తనపై అవినీతి వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆయన చెప్పారు. విదేశాల్లో చదువుకుని రెండేళ్లు ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం కూడా చేశానని చెప్పారు. ప్రజాసేవ కోసం అన్నీ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని లోకేష్ అంటున్నారు.
Top