ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కుల రాజకీయాల గురించి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ నిర్వహించిన బీసీ గర్జన సభ గురించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దెందులూరు నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు చింతమనేని ప్రభాకర్ దళితులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించాయి. చింతమనేని చేసిన వ్యాఖ్యల పట్ల చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు మరియు సామాజిక వేత్తలు అసహ్యం చెందారు.
బాధ్యతగల పదవిలో ఉండి చింతమనేని ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అంటూ ఖండించారు. టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులను దూషించినా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్య తీసుకోవడం లేదని,దానికి కారణం చంద్రబాబుకు ఉన్న కుల పిచ్చి అని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ప్రభాకర్ ఒక రౌడీ లా వ్యవహరిస్తుంటే, ఎమ్మార్వో వనజాక్షి పై ప్రభాకర్ దౌర్జన్యానికి పాల్పడిన రోజునే చంద్రబాబు చర్య తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడేది కాదని ఆమె అన్నారు. ప్రభాకర్ నిత్యం ఎవరో ఒకరికి దూషిస్తూ, వారిపై దురుసుగా వ్యవహరిస్తున్నారని,ఆయన ఆగడాలకు అంతు లేకుండా పోయిందని రోజా మండిపడ్డారు. ఇంతటి దారుణమైన కులగజ్జి నాయకులకు రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమయిందని పేర్కొన్నారు.