రెడ్డి కులం అంటే ఏంటో తెలియజేసిన పవన్..!

By Xappie Desk, February 25, 2019 11:14 IST

రెడ్డి కులం అంటే ఏంటో తెలియజేసిన పవన్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న తరుణంలో తన పార్టీ తరపున ఎన్నికల ప్రచారాన్ని జోరుగా పెంచారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీ పటిష్టంగా ఉన్న నేపథ్యంలో తాజాగా రాయలసీమ ప్రాంతం పై దృష్టి సారించారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో ఇటీవల కర్నూలు జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ అక్కడ ఏర్పాటు చేసిన రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాయలసీమ ప్రాంత ప్రజల గురించి మరియు ఫ్యాక్షన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా రౌడీయిజం, ఫ్యాక్షనిజం నుంచి బయటపడాలని, రాజకీయాల్లో మార్పు రావాలని అన్నారు. కర్నూలు అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గుర్తొస్తాడు. రెడ్డి అంటే కులం కాదు.. ప్రజలను రక్షించేవాడు. నేను ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకునేది నాకోసం కాదు. ఉద్యోగాల కోసం, దౌర్జన్యాన్ని ఎదుర్కోవడానికి మాత్రమే. నామీద అంత నమ్మకం పెట్టుకున్నారు. నాదగ్గర డబ్బులు, పత్రికలూ, టీవీ చానళ్ళు ఏం లేవు. నాకు వాళ్ళలా అబద్దాలు చెప్పడం రాదు. రాత్రికి రాత్రి అద్భుతాలు చేయలేను.. జనసేన పార్టీ లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు. నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం కూడా ప్రజల్లో బతికేందుకు కానీ వారిలా మోసం చేద్దామని కాదు అంటూ తీవ్ర భావోద్వేగంగా ప్రసంగించారు.Top