చంద్రబాబు మెడ చుట్టూ బిగిస్తున్న డేటా లీకేజ్ కేసు..!
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు తాజాగా డేటా లీకేజ్ కేసు కొత్త తలనొప్పులు తీసుకు వస్తుంది. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న క్రమంలో రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సర్వేలలో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం ఇంకా అయిపోయినట్లేనని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో డేటా లీకేజ్ వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మద్య పెను తుఫానుగా మారబోతోంది. ఏపీ ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత డాటాను సేవా మిత్ర యాప్‌తో దొంగిలించారని, దీనికి ఐటీగ్రిడ్ సంస్థ సహకరిస్తోందని వైసీపీ ఐటీ వింగ్ లోకేశ్వర్‌రెడ్డి కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అతనితో పాటు వైసీపీ నేతలు కూకట్ పల్లిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై కేసు పెట్టడం కలకలంగా మారింది. ఏపీలో జరుగుతున్న డేటా బాగోతం కూకట్‌పల్లికి లింక్ వుండటంతో రెండు పార్టీల మధ్య వార్ రెండు రాష్టాల మధ్య వార్‌గా మారుతోంది. ఏపీ ఓటర్ల డేటా చౌర్యానికి గురైందంటూ ఏపీ ఎంపీ, వైసీపీ నేత విజయసాయిరెడ్డి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం, వెంటనే వారు రంగంలోకి దిగి కీలక ఆధారాలు సేకరించడం వంటి పరిణామాలు టీడీపీకి మింగుడు పడటం లేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వంపై, తెరాస కీలక అధినాయకత్వంపై టీడీపీ శ్రేణుల విమర్శలు మొదలయ్యాయి. సేవా మిత్ర యాప్‌తో టీడీపీ వ్యతిరేక ఓటర్లను గుర్తించి వారి ఓటును రద్దుచేసే కుట్ర జరుగుతోందని వైసీపీ నేతలు ఆందోళ వ్యక్తం చేస్తుంటే ఏపీ ముఖ్యమంత్రి ఏకంగా కూకట్‌పల్లికి ఏసీపీ స్థాయి అధికారిని పంపించి బెదిరింపులకు దిగడం సర్వత్రా సంచలనం సృష్టిస్తోంది. మొత్తం మీద ఈ కేసులో పరిణామాలు చూస్తుంటే ఎన్నికలు జరగక ముందే చంద్రబాబునాయుడు మెడ చుట్టూ ఉచ్చులు బిగుస్తున్నట్లు అర్థమవుతుంది.