మీ స్థాయికి తగ్గ మాటలు కావు పవన్ కళ్యాణ్ అంటున్న పోసాని కృష్ణ మురళి…!
ప్రముఖ సినీ రచయిత నటుడు పోసాని కృష్ణమురళి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర ప్రజలపై దాడులు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లపై పోసాని కృష్ణ మురళి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఒకరి గెలుపు కోసం... స్వార్థ రాజకీయాల కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజల మధ్య జరగని ఘటనలను జరిగినట్టు చిత్రీకరించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య గొడవలు పెట్టాలని పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తి ఆలోచించడం చూస్తుంటే అసహ్యం వేస్తుందని అన్నారు.
గోదావరి జిల్లాలకు వెళ్లి రాయలసీమ ప్రాంతం వాళ్ళు వస్తే తన్ని తరిమేస్తే..పులివెందుల గూండాలు వస్తే తాటతీస్తా...మళ్లీ రాయలసీమ ప్రాంతాలకు వచ్చి రాయలసీమ ప్రజలు పౌరుషానికి ప్రతీక అని ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతానికి చెందిన ప్రజలను పొగుడుతూ బేధాభిప్రాయాలు సృష్టిస్తూ స్వార్ధ రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ని చూస్తుంటే జాలి వేస్తుందని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర ప్రజలు చాలా సురక్షితంగా ఉన్నారని లేనిపోని మాటలు చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా పవన్ కళ్యాణ్..రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఏదైనా ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఎటువంటి మేలు చేస్తారు..అధికారంలోకి వస్తే ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారు వంటి విషయాలను తెలియ చేయాలని ఇలా ప్రజల మధ్య భేదాభిప్రాయాలను సృష్టించి లేనిది ఉన్నట్టుగా...ఉన్నది లేనట్టుగా మాట్లాడటం పవన్ కళ్యాణ్ లాంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తికి తగదు అని పవన్ కళ్యాణ్ కు సూచించారు పోసాని కృష్ణ మురళి.