ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రస్తుతం ఎన్నికల వాతావరణాన్ని చూస్తుంటే యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సర్వేలలో వైసీపీ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని ఫలితాలు వస్తున్న నేపథ్యంలో...తెలుగుదేశం పార్టీ నాయకులు ఓర్వలేక చేతిలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగ పరుస్తున్నారు అంటూ తిరువూరు కు చెందిన వైసీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు కామెంట్ చేస్తారు. తాజాగా ఇటీవల తిరువూరులో జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో..జగన్ ప్రసంగిస్తుండగా తిరువూరు వ్యాప్తంగా ఉన్న కేబుల్ వైర్లను టీడీపీ శ్రేణులు కట్ చేశాయని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. కేవలం జగన్ ప్రసంగిస్తున్న సమయంలో మాత్రమే కేబుల్ ఆపరేటర్లు టీడీపీ నేతల ప్రోద్బలంతో కనెక్షన్ తీయించేశారని, జగన్ ప్రసంగం కొనసాగుతున్నా కేబుల్ కనెక్షన్‌లను తీయించేయడం వెనుక టీడీపీ నేతల కుట్ర దాగుందని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. తిరువూరులో వైసీపీకి బలం పుంజుకుంటున్న నేపథ్యంలో టీడీపీ నేతలు కేబుల్ ఆపరేటర్లతో కుమ్మక్కై జగన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా కేబుల్ వైర్లను కట్ చేయించారని వైసీపీ నేతలు చెబుతున్నారు.