ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్న క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి తోడు అవుతున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. గతంలోనే బాబాయ్ పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే కచ్చితంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని తెలియజేసిన చెర్రీ ఎన్నికలకు ఇంకా కొద్ది రోజులే ఉన్న నేపథ్యంలో రంగంలోకి దిగడంతో మెగా అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.
ముఖ్యంగా రాజమౌళి తో తీస్తున్న సినిమా షూటింగ్ లో గాయపడిన రామ్ చరణ్ తన బాబాయ్ కోసం గాయాన్ని పక్కన పెట్టి జనసేన పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరచటానికి తన వంతు కృషి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆదివారం నుండి రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు పార్టీ నుండి వస్తున్న సమాచారం. ఇదే క్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు నరసాపురం నియోజకవర్గం నుండి లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో తండ్రి నాగబాబు తరఫున కూతురు నిహారిక మరియు ఆయన భార్య పద్మజ హీరో వరుణ్ తేజ్ ప్రచారం చేస్తున్నారు. ఇలా మెగా ఫ్యామిలీ లో సగం ఏపి రాజకీయాలలో పర్యటిస్తున్న క్రమంలో మెగా అభిమానులు ఎంతగానో సంతోషంగా ఉన్నారు.