ఘనవిజయం సాధించబోతున్నాం : జగన్
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధించబోతోందనే గట్టి ధీమా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా తాము ఘన విజయం సాధించబోతున్నామని దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేయగా.
పార్టీ నేతలు సైతం అదే ధీమాతో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన పోలింగ్ సరళిని పరిశీలిస్తే తమకు పూర్తి సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయనే అంచనాతో వారున్నారు. 13 జిల్లాల్లో 80 శాతానికిపైగా ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారన్న వార్త ఆ పార్టీ శ్రేణుల్లో అమితోత్సాహాన్ని కలిగిస్తోంది.
పోలింగ్ శాతం పెరిగితే తమ గెలుపు ఖాయమని ఆ పార్టీ ముందునుంచే అంచనా వేస్తోంది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంపై భారీ ఎత్తున వ్యతిరేకత కనిపిస్తోందని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోసహా ఇతర నేతలంతా ఇప్పటివరకు చెబుతూ వచ్చారు.
చంద్రబాబు ఐదేళ్ల పాలనపై జనం విసిగి వేసారి ఉన్నారనేది వారు గ్రహించారు. ఈ ప్రభుత్వ వ్యతిరేకతే గురువారం పోలింగ్ సందర్భంగా ఓట్ల రూపంలో బయట పడిందనే చర్చ పార్టీలో సాగుతోంది.