2019 ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ప్రజాక్షేత్రంలో తామేంటో రుజువు చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ మరియు లోకేష్ లు ఎన్నికల బరిలోకి దిగారు. 2014 ఎన్నికల్లో జనసేన పార్టీని స్థాపించి ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి పోటీకి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా మొట్టమొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయడం తో అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమా రంగంలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదే క్రమంలో నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ గత ఎన్నికలలో ఏ మాత్రం పోటీ చేయకుండా ఎమ్మెల్సీ పదవిని చేపట్టి మూడు శాఖలకు మంత్రి అయ్యి తాజాగా 2019 ఎన్నికలలో మొట్టమొదటిసారి పోటీ చేస్తున్న క్రమంలో లోకేష్ పొలిటికల్ కెరియర్ పై కూడా ఆసక్తి నెలకొంది.
అయితే వీరిద్దరూ పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో తాజాగా జరిగిన సర్వేలో గెలవడం అంత సునాయాసంగా లేదని ఫలితాలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ విశాఖపట్నం గాజువాక నియోజకవర్గం నుండి మరియు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న క్రమంలో రెండు చోట్ల కూడా పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తాజాగా జరిగిన సర్వేలో ఫలితాలు ఇచ్చినట్లు సమాచారం. మరోపక్క నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో గెలిచే ఛాన్స్ లు చాలా తక్కువగా ఉన్నట్లు సర్వేలలో ఫలితాలు వెల్లడవుతున్నాయి. మొత్తంమీద చూసుకుంటే మొట్టమొదటిసారి తామేంటో రుజువు చేసుకోవాలని ఎన్నికల్లో పోటీకి దిగిన పవన్ కళ్యాణ్ - లోకేష్ లకు విజయం నల్లేరు మీద నడక అవ్వడం కష్టమని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. మరి రిజల్ట్ వచ్చాక సీన్ ఎలా ఉంటుందో చూడాలి.