ఎవరీ హోంమంత్రి మేకతోటి సూచరిత?

Written By Aravind Peesapati | Updated: June 11, 2019 17:24 IST
ఎవరీ హోంమంత్రి మేకతోటి సూచరిత?

ఎవరీ హోంమంత్రి మేకతోటి సూచరిత?
 
ఏపీలో ఇప్పుడీ పేరు మార్మోగిపోతోంది. అత్యంత కీలకమైన హోంశాఖను సుచరితకు కట్టబెట్టడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ విషయంలో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలోనే సీఎం జగన్ నడిచారు. 2009లో సబితా ఇంద్రారెడ్డికి అప్పటి సీఎం వైఎస్ హోంమంత్రి పదవి ఇచ్చారు. ఏపీ తొలి మహిళా హోంమంత్రిగా ఆమె బాధ్యతలను నిర్వర్తించారు. ఇక తాజాగా జగన్ సైతం మహిళా నేతకే రాష్ట్ర శాంతిభద్రతల నిర్వహణను అప్పగించారు. మేకతోటి సుచరితను హోంమంత్రిని చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాంతో నవ్యాంధ్ర తొలి మహిళా హోమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు సుచరిత. 41 ఏళ్ల మేకతోటి సుచరిత స్వస్థలం ఫిరంగిపురం. ఆమె భర్త దయాసాగర్. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. బీఏలో గ్రాడ్యుయేషన్ చేశారు సుచరిత. ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్సార్ స్ఫూర్తితో మేకతోటి సుచరిత రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేశారు. 2006లో కాంగ్రెస్ పార్టీ తరపున ఫిరంగిపురం జెడ్పీటీసీగా గెలిచారు. అనంతరం 2009లో పత్తిపాడు (గుంటూరు) ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు అవకాశమిచ్చారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి 2,500 మెజార్టీతో గెలిచారు. వైఎస్ మరణం తర్వాత 2012లో ఎమ్మెల్యే పదవికి రాజీనామాచేసి జగన్ వెంట నడిచారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో 16వేల మెజార్టీతో విజయం సాధించారు సుచరిత. ఇక 2014 ఎన్నికల్లో అప్పటీ టీడీపీ నేత రావెల కిశోర్ బాబు చేతిలో ఓడిపోయారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పత్తిపాడు నుంచే పోటీచేసి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి డొక్కా మాణిక్యప్రసాద్‌పై 7,398 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం వైఎస్ జగన్ కేబినెట్‌లో ఎస్సీ కోటాలో ఆమెకు మంత్రి పదవి దక్కింది. అంతేకాదు ఏకంగా హోంమంత్రి పదవిని దక్కించుకొని సంచలనంగా మారారు. నవ్యాంధ్ర తొలి మహిళా హోంమంత్రిగా చరిత్ర సృష్టించారు సుచరిత.
Top