2 తెలుగు రాష్ట్రాలలో కలకలం సృష్టిస్తున్న డేటా లీకేజ్ వ్యవహారం..!
రెండు తెలుగు రాష్ట్రాలలో డేటా లీకేజ్ వ్యవహారం పెద్ద కలకలం రేపుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఓటర్ల సేకరణ కోసం ఏర్పాటు చేసిన సేవా మిత్ర యాప్ పేరిట ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ కి చెందిన ఓట్లను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ ఏర్పాటు చేసిన సేవా మిత్ర యాప్ వెనుక హైదరాబాద్‌కు చెందిన ఐటీ గ్రిడ్ సంస్థతో పాటు విశాఖకు చెందిన బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీ సంస్థ హస్తం కూడా వుందని తాజాగా బయటపడుతోంది.
గత కొంత కాలంగా తెలుగు దేశం పార్టీకి ఐటీ సేవలందిస్తున్న ఐటీ గ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన సేవా మిత్ర యాప్‌లో ఏపీకి చెందిన మూడు కోట్ల ఓటర్ల జాబితా వుందని, ఇందులో వున్న వైఎస్ ఆర్ సీపీ ఓటర్లని తొలిగించడం, మభ్యపెట్టడంలో భాగంగానే డేటా కుట్ర జరిగిందని వైఎస్ ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి తెలంగాణలోని సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు రచ్చ మొదలైంది. అయ్యప్ప సొసైటీలో వున్న ఐటీ గ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కర్యాలయంలో సోదాలు నిర్వహించిన సైబరాబాద్ పోలీసులకు కీలక సమాచారం లభించింది. దీని వెనక ఎంత పెద్దవారు వున్నా, ప్వయంగా ఏపీ ముఖ్యమంత్రి వున్నా వదిలేది లేదంటూ సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించడం ఏపీ టీడీపీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది.