ఏపీ అభివృద్ధికి కచ్చితంగా సహకరిస్తామంటున్నారు కేసీఆర్..?

Written By Siddhu Manchikanti | Updated: May 26, 2019 10:45 IST
ఏపీ అభివృద్ధికి కచ్చితంగా సహకరిస్తామంటున్నారు కేసీఆర్..?

ఏపీ అభివృద్ధికి కచ్చితంగా సహకరిస్తామంటున్నారు కేసీఆర్..?
 
ఎపి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్ కు, ఎపి ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ స్నేహ హస్తం అందించారు.ఇచ్చిపుచ్చుకునే విదంవగా వ్యవహరించడమే తమ విదానమని కెసిఆర్ అన్నారు. జగన్, కెసిఆర ల భేటీ తర్వాత సి.ఎమ్. కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. గోదావరి, కృష్ణా నదీ జలాలను సమర్థంగా వినియోగించుకుంటే రెండు రాష్ట్రాలూ సుభిక్షంగా ఉంటాయన్నారు. ‘‘ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడం మంచిదని మేము మొదటినుంచీ భావిస్తున్నాం. నేను స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫఢణవీస్‌ను కలిశాను. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ -మహారాష్ట్ర మధ్య ఉన్న జల వివాదాల కారణంగా ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోవడంపై నేనే చొరవ తీసుకుని మాట్లాడా. లివ్ అండ్ లెట్ లివ్ తమ విధానమని చెప్పాను.
 
వివాదాలు పరిష్కరించుకోవడం వల్ల రెండు రాష్ట్రాలకూ మేలని వివరించాను. దీంతో సహకరించడానికి మహారాష్ట్ర ముందుకొచ్చింది. ఫలితంగా కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులు నిర్మించుకోగలుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా ఇలాంటి సంబంధాలనే కొనసాగించాలన్నది మా విధానం. రెండు రాష్ట్రాలకు మేలు కలిగేలా వ్యవహరిద్దాం’’ అని జగన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ‘గోదావరి నది నుంచి ఏటా 3,500 టీఎంసీల జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం గరిష్టంగా 700-800 టీఎంసీలు మాత్రమే వాడుకోగలదు. మిగతా నీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకునే వీలుంది. ప్రకాశం బ్యారేజీ ద్వారా సోమశిల వరకు గ్రావిటీ ద్వారానే గోదావరి నీటిని పంపించవచ్చు. దీంతో యావత్ రాయలసీమను సస్యశ్యామలం చేయవచ్చు. కేవలం రెండు లిఫ్టులతో గోదావరి నీళ్లను రాయలసీమకు పంపించవచ్చు. గోదావరి నీళ్లను వాడుకుని ఆంధ్రప్రదేశ్ రైతులకు సాగునీరు ఇవ్వవచ్చు’’ అని కేసీఆర్ సూచించారు. త్వరలోనే రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులతో సమావేశమై అన్ని అంశాలపై చర్చించుకోవాలని ఇద్దరు నాయకులూ నిర్ణయించారు.
Top