ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఉదయం సచివాలయంలో బాద్యతలు చేపట్టారు. సరిగ్గా 8.39 గంటల ముహూర్తానికి ఆయన సిఎమ్ కుర్చీలో కూర్చున్నారు. ఆయన తొలిసారి సచివాలయానికి వస్తున్న సందర్భంగా సెలవు రోజు అయినా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వాగతం చెప్పారు. పలువురు నేతలు కూడా జగన్ కు శుబాకాంక్షలు తెలియచేశారు. వేదపండితుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి.. ఉదయం 8.39 గంటలకు తన ఛాంబర్‌లో సీఎం అడుగుపెట్టారు.
వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆయన తన చాంబర్‌లోని కుర్చీపై ఆసీనులయ్యారు. సచివాలయంలోకి అడుగుపెట్టి.. ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరించిన అనంతరం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మూడు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఆశావర్కర్ల జీతాలను రూ. మూడు వేల నుంచి రూ. 10వేలకు పెంచుతూ.. తొలి సంతకం చేశారు. అనంతరం ఎక్స్‌ప్రెస్ హైవేకి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరుతూ రెండో సంతకం చేశారు. జర్నలిస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ ఫైల్‌పై సీఎం జగన్ మూడో సంతకం చేశారు.