ఏపీ స్పెషల్ స్టేటస్ పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు : ఏపీ సీఎం జగన్..!
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తాజాగా ఢిల్లీ పర్యటన చేపట్టారు. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రసంగించడానికి బయలుదేరిన జగన్ ఢిల్లీలో నార్త్ బ్లాక్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నూ కలిశారు. వైసీపీ పార్టీ ఎంపీలతో దాదాపు అరగంట పాటు కేంద్ర హోం మంత్రి తో మాట్లాడిన జగన్..విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో అలాగే ఏపీ కి స్పెషల్ స్టేటస్ ఎంత అవసరమో వంటి విషయాలను షా కి వివరించారు. అంతే కాకుండా రాష్ట్రానికి కేంద్రం నుండి రావలసిన నిధుల విషయంలో గురించి కూడా అమిత్ షా తో ఏపీ సీఎం జగన్ ప్రస్తావించారు. దీంతో జగన్ ప్రస్తావించిన అంశాలన్నిటినీ పరిగణలోకి తీసుకుని ప్రస్తుతం తక్షణం దృష్టి సారించాల్సిన అంశాల గురించి అమిత్ షా ఆరా తీసినట్లు సమాచారం.
అంతేకాకుండా కేంద్రం నుండి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాల సహకారం ఉంటుందని జగన్ కి తెలియజేశారు అమిత్ షా. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ శనివారం ఢిల్లీలో జరిగి నీతి అయోగ్ సమావేశంలోనూ ఏపీ సమస్యలను ప్రస్తావిస్తానని స్పష్టం చేసారు . ఏపీకీ ప్రత్యేక హోదా అంశం పైన అమిత్ షాతో చర్చించామని..ఏపీ స్పెషల్ స్టేటస్ పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అదే విధంగా నీతి అయోగ్ సమావేశంలోనూ దీని పైనే ప్రధానంగా ప్రస్తావించి..ఏపీకీ హోదా ఎందుకు అవసరమో అంకెలు..వాస్తవ పరిస్థితులతో సహా వివరిస్తానని జగన్ వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే వరకూ తాను ప్రధానిని అడుగుతూనే ఉంటానని స్పష్టం చేసారు. అదే సమయంలో లోక్‌సభలో వైసీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి ఆఫర్ చేసారనే వార్తల పైనా జగన్ స్పందించారు. ఇవన్నీ ఊహాగానాలే అంటూ..అటువంటి ప్రతిపాదన తమ వద్దకు రాలేదని స్పష్టం చేసారు.