గ్రామ వాలంటీర్ల నోటిఫికేషన్ విడుదల చేసిన జగన్ ప్రభుత్వం…!

Written By Siddhu Manchikanti | Updated: June 23, 2019 12:21 IST
గ్రామ వాలంటీర్ల నోటిఫికేషన్ విడుదల చేసిన జగన్ ప్రభుత్వం…!

గ్రామ వాలంటీర్ల నోటిఫికేషన్ విడుదల చేసిన జగన్ ప్రభుత్వం…!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్. ముఖ్యంగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన రోజున ప్రతి గ్రామంలో ఉన్న నిరుద్యోగులకు గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ప్రకటన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాటకు తగ్గట్టుగానే జగన్ ప్రభుత్వం ముందడుగు వేసింది. తాజాగా ఇటీవల దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వాలంటీర్ల నియామకం కోసం.. గ్రామం, మున్సిపల్ వార్డును ఒక యూనిట్‌గా తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో మండలాన్ని యూనిట్‌గా తీసుకొని.. ఆ మండల పరిధిలో నియమించే వాలంటీర్ల సంఖ్య లెక్కిస్తారు. ఆ తర్వాత ఆ సంఖ్యకు అనుగుణంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటిస్తారు. అన్ని విభాగాల్లో సగం మంది మహిళలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వాటిని పట్టణ స్థాయిలో మున్సిపల్ కమిషనర్, మండల స్థాయిలో ఎంపీడీవో అప్లికేషన్లను పరిశీలిస్తారు. అర్హులైన అభ్యర్థులను మండల స్థాయిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు.
 
ఈ నియామకాల కోసం పట్టణాలు, మండల స్థాయిలో ముగ్గురు అధికారులతో కమిటీలను నియమించనున్నారు. పట్టణ ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్ లేదా డిప్యూటీ కమిషనర్ చైర్మన్‌గా ఉంటారు. తహసిల్దార్, జిల్లా కలెక్టర్ నియమించే మరో అధికారి సభ్యులుగా ఉంటారు. మండల స్థాయి కమిటీలో ఎంపీడీవో చైర్మన్‌గా ఉంటారు. తహసిల్దార్, ఈవోపీఆర్‌డీ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలే అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక పరిస్థితులపై అభ్యర్థికి ఉన్న అవగాహన, సామాజిక స్పృహ లాంటి అంశాలపై ఇంటర్వ్యూ ఉంటుంది. వాలంటీర్లుగా ఎంపికైన వాళ్లకు ప్రతి నెలా 5 వేల రూపాయల గౌరవ వేతనాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి శిక్షణ ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వమే చూసుకుంటుంది. ఇటువంటి విషయాల్లో ఏవిధంగా స్పందించాలో వంటి వాటిపై అభ్యర్థులకు అవగాహన ఉండేలా కార్యక్రమాలు రూపొందించడం జరుగుతోంది.




Top