దేవుడు స్క్రిప్టు అంటూ జగన్ కి కౌంటర్లు వేసిన నారా లోకేష్…!
ఎన్నికల గెలిచాక జగన్ తన పార్టీకి చెందిన గెలిచిన వారితో సమావేశం అయిన సందర్భంలో అలాగే అసెంబ్లీ మొదటి సమావేశాలలో జగన్ ప్రసంగిస్తూ గతంలో తనని మోసం చేస్తూ తన పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను ముగ్గురు ఎంపీలను చంద్రబాబు అన్యాయంగా తీసుకున్న సమయంలో దేవుడు చూశాడని మే 23 వ తారీకున ప్రజల చేత చంద్రబాబుకి అదే 23 మంది ఎమ్మెల్యేలను ముగ్గురు ఎంపీలను ఇచ్చాడని పేర్కొంటూ ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా మాజీ మంత్రి లోకేష్ దేవుడి స్క్రీప్ట్ అంటూ ముఖ్యమంత్రి జగన్ పై కౌంటర్లు చేశారు. ఆయన ట్విటర్ లో తన వ్యాఖ్యలు చేస్తూ ‘దేవుడి స్క్రిప్ట్‌లో ట్విస్ట్‌లూ ఉంటాయి జగన్ గారూ! దేవుడు స్క్రిప్ట్ రాస్తూ పూర్తిగా ముగించలేదు. రాస్తూ, రాస్తూ కామా పెట్టాడంతే! అది ఫుల్‌స్టాప్ అనుకున్నారు మీరు. ఈ గ్యాప్‌లోనే మీరు గుడినీ, గుడిలో లింగాన్ని మింగేయాలనుకుంటున్నారని’ ఎదురు ఆరోపించారు. టీడీపీ హయాంలో విద్యుత్ కొనుగోళ్లు అక్రమమని మీరంటే... అవి ముట్టుకుంటే షాక్ కొడతాయని కేంద్రంతో లేఖ రాయించాడని వ్యాఖ్యానించారు. దేవుడి స్కిప్ట్‌లో ఇటువంటి కామాలు చాలానే ఉంటాయన్నారు. భ్రమరావతి అన్న మీ భ్రమలు తొలగించుకునేందుకు దేవుడే ఓ ఛాన్సిచ్చాడని ఆయన అన్నారు. సెక్రటేరియట్‌లో సీఎం సీటులో కూర్చున్నప్పుడైనా, అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడైనా చంద్రబాబుగారికి మనసులో కృతజ్ఞతలు చెప్పుకో అని స్క్రిప్ట్‌లో మళ్లీ కామా పెట్టాడంటూ లోకేష్ అన్నారు.