కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఆయనే?

Written By Siddhu Manchikanti | Updated: July 09, 2019 11:40 IST
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఆయనే?

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఆయనే?
 
కర్ణాటక రాజకీయం రోజురోజుకి క్షణక్షణానికి మారిపోతుంది. ఇప్పటికే కాంగ్రెస్ జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది రాజీనామాలు చేయగా మరికొంత మంది రాజీనామా చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన నాగేష్ మంత్రి పదవి చేపట్టడం గతంలో మనం చూశాం. అయితే తాజాగా తన మంత్రి పదవికి రాజీనామా చేసి కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఇదే క్రమంలో ఒకవేళ భారతీయ జనతా పార్టీ కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపిస్తే బీజేపీకి బేషరతుగా మద్దతు తెలుపుతా అంటూ నాగేష్ గవర్నర్ కి ఇచ్చిన లేఖలో స్పష్టం చేయడం జరిగింది. ఇదే క్రమంలో బీజేపీ కూడా కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పావులు కదుపుతోంది.
 
మరోపక్క కర్ణాటక సీఎం కుమారస్వామి గవర్నర్ అపాయింట్ మెంట్ తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో కుమార స్వామి గవర్నర్ తో భేటీ కాబోవడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. కర్ణాటక సీఎం గా కుమారస్వామి వద్దు అని ఆయన స్థానంలో మాజీ హోంమంత్రి రామలింగా రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించాలి అంటూ సోషల్ మీడియా లో పోస్టర్లు వెల్లువెత్తడం మరోపక్క ఇలా ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజీనామాలు చేయడం వెనుక మాజీ సీఎం సిద్దరామయ్య హస్తం ఉందంటూ ఆరోపణలు రావడం తో కుమార స్వామి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో పక్క బిజెపి కనుక కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎడ్యూరప్ప కి ముఖ్యమంత్రి పదవి అప్పజెప్పడం ఖాయమనే వార్తలు వినబడుతున్నాయి.
Top