ఈ విధంగా చంద్రబాబు కాపులను మోసం చేశారు అంటున్న ముద్రగడ..!
గతంలో 2014 ఎన్నికల సమయంలో కాపులను బీసీల్లో చేరుస్తానని చెప్పి చంద్రబాబు కాపులకు హామీ ఇచ్చి తర్వాత ఆ హామీని గాలికొదిలేయడం జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు ముద్రగడ పద్మనాభం టిడిపి ప్రభుత్వం పై కాపుల తరఫున పోరాటం చేయడం జరిగింది. ఆ సమయంలో చంద్రబాబు ముద్రగడ పద్మనాభం ని అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్ అవటంతో ముద్రగడ పద్మనాభం చంద్రబాబు మమ్మల్ని ఈ విధంగా మోసం చేశారు అంటూ జగన్ కు లేఖ రాశారు. చంద్రబాబు చేసిన మోసాలను గమనించిన కాపులు టిడిపి పాలన అంతం చేయడానికి వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు ఓటు వేశారని ఆయన లేఖలో పేర్కొన్నారు.
అందువల్ల కాపులకు రిజర్వేషన్ లు కల్పించాలని ముద్రగడ కోరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించడం కోసం తెదేపా అధినేత చంద్రబాబు కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చారని, చంద్రబాబు గెలుపు కోసం కాపు సామాజిక వర్గమంతా పోరాడితే తెదేపా ప్రభుత్వం అరాచక పాలన చేసిందని లేఖలో పేర్కొన్నారు. అగ్రవర్ణ పేదలకు అప్పట్లో కేంద్రం పది శాతం రిజర్వేషన్ కల్పించింది. అందులో సగం కాపులకంటూ చంద్రబాబు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి చేతులు దులుపుకొన్నారు ఆయన తెలిపారు. తహసీల్దార్ కార్యాలయాల్లో బీసీ సర్టిఫికెట్ అడుగుతుంటే అలాంటి అవకాశమే లేదని అధికారులు చెబుతున్నారని, కాపులు చంద్రబాబు మోసాన్ని గమనించి ఆయనను ఓడించారని ముద్రగడ పేర్కొన్నారు.