ఇక నుండి టివి 9 కు రవి ప్రకాష్ కి ఎటువంటి సంబంధం లేదు…!
గత రెండు రోజుల నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో టివి 9 రవి ప్రకాష్ ఫోర్జరీ కేసు సంచలనం సృష్టిస్తుంది. రాజకీయ రంగంలోని మీడియా రంగం లోని చాలామంది ఈ కేసు విషయమై ఇప్పటికే సోషల్ మీడియాలో తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో రవి ప్రకాష్ తనపై వస్తున్న ఆరోపణలకు వాస్తవం లేదని ఒక వీడియో చిత్రీకరించిన వాటిని కొట్టిపారేస్తూ టీవీ9 కొత్త యాజమాన్యం సంచలన ప్రకటన చేసింది. టివి 9 దైనందిన కార్యకలాపాలకు , రవిప్రకాష్ కు ఇక ఎలాంటిసంబందం లేదని కొత్త యాజమాన్యం ప్రకటించింది.
సిఈఓ, డైరెక్టర్ పదవుల నుంచి ఆయనను తొలగించామని మీడియా డైరెక్టర్ సాంబశివరావు వెల్లడించారు. సంస్థలో అవకతవకలు చోటుచేసుకున్నాయని తమ దృష్టికి వచ్చిన వెంటనే డైరెక్టర్ల సమావేశం నిర్వహించి మే 8న ఆయనను పదవి నుంచి తొలగించామని తెలిపారు. 9 నెలల క్రితమే టీవీ9లో 90.5 శాతం వాటాలను ఏవీసీఎల్ నుంచి అలందా మీడియా కొనుగోలు చేసిందని, కొనుగోలు అనంతరం సంస్థలో చాలా అవరోధాలు సృష్టించారని, సంస్థలో 8 శాతం వాటా ఉన్న వాళ్లు నియంత్ర చేయాలని చూశారని ఆయన చెప్పారు. డైరెక్టర్ల సమావేశం జరగకుండా రవి ప్రకాశ్, మూర్తి అడ్డుపడ్డారని అన్నారు. వాటాదార్లందరి అభిప్రాయం మేరకే రవిప్రకాశ్‌ను తొలగిస్తున్నామని ఆయన ప్రకటించారు. కంపెనీ సెక్రటరీ సంతకాన్ని రవి ప్రకాశ్ ఫోర్జరీ చేశారని ఆయన వెల్లడించారు.
తన సంతకాన్ని రవి ప్రకాశ్ ఫోర్జరీ చేశారని కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాలే స్వయంగా ఫిర్యాదు చేసినట్లు సాంబశివరావు పేర్కొన్నారు. యజమాన్య మార్పిడి జరగకుండా రవి ప్రకాశ్, మూర్తి ఎన్నో అవరోధాలు సృష్టించారని, తప్పుడు నిర్ణయాలతో సంస్థను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించినట్లు తెలిపారు. ప్రస్తుతం టీవీ9లోని అన్ని ఛానెళ్లు కొత్త సంస్థ పరిధిలోకి వస్తామని స్పష్టం చేశారు. తాజా ఘటన నేపథ్యంలో టీవీ9తో రవిప్రకాశ్, మూర్తిలకు ఎలాంటి సంబంధంలేదని తేల్చిచెప్పారు. అలాగే వాళ్లిదరూ ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు జరిపితే మాకంపెనీకి ఎలాంటి సంబంధంలేదని ఆయన స్పష్టంచ ఏశారు. షేర్ హోల్డర్ గా సమావేశాలకు రావచ్చని ఆయన వివరించారు.